కేశవానంద భారతి కేసు సంబంధించి ప్రత్యేక వెబ్‌పేజ్‌

కేశవానంద భారతి కేసులో చారిత్రక తీర్పు వెలువడి 50 ఏళ్లు పూర్తయిన సందర్బాన్ని పురస్కరించుకుని ఆ తీర్పునకు సంబంధించిన రాతప్రతులు, ఇతర సమాచారంతో ప్రత్యేక వెబ్‌పేజ్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు.
సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటిసారిగా ఈ కేసు విచారణ కోసం 13 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
1973 నాటి ఈ కేసులో తీర్పు కూడా చాలా స్వల్ప మెజారిటీ 7:6తో వెలువడింది. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్‌ మార్చలేదని సుప్రీం ఆనాడు స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని కీలకమైన అంశాలు వేటినైనా మార్చేందుకు పార్లమెంట్‌ తన విశేషాధికారాన్ని ఉపయోగించలేదని కేశవానంద భారతి కేసులో తీర్పు స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వెబ్‌పేజ్‌లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వాదోపవాదాలు, పిటిషన్లు, తీర్పులు అన్నీ వుంటాయని చంద్రచూడ్‌ ప్రకటించారు.
 
‘ యావత్ ప్రపంచ పరిశోధకులు చూసేందుకు వీలుగా కేశవానంద కేసుకు సంబంధించి ఉన్న అన్ని లిఖిత పూర్వక ఫైళ్లతోకూడిన ఓ వెబ్‌పేజీని ఏర్పాటు చేశాం. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ( ఏప్రిల్ 24న) ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడింది’ అని డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొనగానే కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులంతా హర్షధ్వానాలు చేశారు.పరిశోధకులు, విద్యార్థులు, న్యాయవాదులకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
 
ఇటీవల చంద్రచూడ్‌ మాట్లాడుతూ, దేశ రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ధృవ నక్షత్రంతో పోల్చారు. ఎదుట పయనించాల్సి వున్న మార్గమంతా సక్రమంగా లేకుండా మెలికలు తిరిగి ఉన్నప్పుడు ఎదురు లేని మార్గదర్శిగా నిలిచేది మన రాజ్యాంగమని ఆయన ప్రశంసించారు.  రాజ్యాంగంలోని మౌలిక స్వరూప సిద్ధాంతం పార్లమెంటరీ సార్వభౌమాధికారాన్ని నీరుగారుస్తోందంటూ ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌తో సహా రాజ్యాంగ ఉన్నతాధికారులు ఇటీవల విమర్శించిన నేపథ్యంలో ఈ వెబ్‌పేజ్‌ను ఆ కేసుకు అంకితం చేసినట్లు ప్రకటించారు.
 
రాజ్యాంగ లిక స్వరూపం, పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించి అత్యంత కీలకమైన కేసుగా కేశవానంద భారతి కేసు న్యాయచరిత్రలో నిలిచింది. కేరళ భూసంస్కరణల చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఆ కేసులో వచ్చిన తీర్పు ఆ తర్వాత ఎన్నో కేసులకు దిక్సూచిగా నిలిచింది. కేరళ ప్రభుత్వం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.”
ఇందులో భాగంగా పార్లమెంటు చేసిన 24, 25, 29 రాజ్యాంగ సవరణల చెల్లుబాటును ఆయన సవాలు చేశారు. ఈ సవరణలు న్యాయవ్యవస్థ అధికారాలతో పాటుగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగగిస్తున్నాయని పేర్కొన్నారు.  దీనిపై 1972 అక్టోబర్ 31న ప్రారంభమైన విచారణ 1973 ఏప్రిల్ 24 వరకు కొనసాగింది. 68 రోజుల సుదీర్ఘ విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి సుప్రీంకోర్టే సంరక్షణదారు అని చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.