కేరళలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది

ఈశాన్య రాష్ట్రాలు, గోవాలో మాదిరి కేరళలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ  ధీమా వ్యక్తం చేశారు. దీనికి కేరళ యువత సహకారం అవసరమని చెబుతూ ఇప్పుడున్న ప్రభుత్వం యువత గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు.  క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు బిజెపిని, దాని పనితీరును, కార్యక్రమాలను ఆమోదించాయని ప్రధాని గుర్తు చేస్తూ, అదే విధంగా కేరళ ప్రజలు కూడా బిజెపిని ఆమోదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

వామపక్షాలు, కాంగ్రెస్ బెంగాల్ లో కేరళలో కొట్లాడుకుంటూ, బెంగాల్ లో చేతులు కలుపుతూ ప్రజలను వంచిస్తున్నాయని ప్రధాని విమర్శించారు. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా మోదీ సోమవారం సాయంత్రం కొచ్చికి వచ్చారు. ఈ సందర్భంగా 2 కి.మీ మెగా రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత ‘యువం2023’ కాన్​క్లేవ్​లో ప్రధాని పాల్గొని మాట్లాడారు.

‘‘కేరళలో దొరికే ఆయుర్వేద మందులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్రం కష్టపడుతుంటే ఇక్కడున్న వాళ్లలో కొందరేమో గోల్డ్ స్మగ్లింగ్​లో బిజీగా ఉన్నారు. కేరళ యువతీయువకులు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటోంది. ఉపాధి అవకాశాల్లేవు.. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు” అని సీఎం పినరయి విజయన్​ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ  విమర్శించారు.

గత కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాలను అవినీతిమయం చేశాయని ప్రధాని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక యువతకు కొత్త అవకాశాలు కల్పించామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా యువతకు ఉద్యోగాలు, వోకల్ ఫర్ లోకల్​తో ఇక్కడి వస్తువులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చామని వివరించారు.

అంతరిక్షం, రక్షణ రంగాలలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, పీఎల్ఐ స్కీం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. కేరళలో రోడ్డు, వాయు, సముద్ర మార్గాలను ఎంతో అభివృద్ధి చేశామని ప్రధాని పేర్కొన్నారు. కనీస మౌలిక సదుపాయాలు పెంపొందిస్తే  కొత్త పరిశ్రమలు వస్తాయని, టూరిజం పెరుగుతుందని చెప్పారు.

కొచ్చి మెట్రో పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, మంగళవారం నుంచి వందే భారత్ ఎక్స్​ప్రెస్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. కేరళ పర్యటనలో ప్రధానిపై దాడి చేస్తామంటూ ఇటీవల ప్రధాని కార్యాలయానికి లేఖ వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రోడ్​ షో సందర్భంగా ప్రధాని కారులో నుంచి దిగి, కాన్వాయ్​ ముందు నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు.

అనంతరం సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో యువత మంచి ఫలితాలు సాధిస్తోందని మోదీ చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేరళ యువత ముందుకొచ్చిందని చెప్పారు.  ఫిషరీస్ సెక్టార్​పై ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రధాన ​మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఆదుకుంటున్నా మని తెలిపారు.

సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్స్ పరీక్షను మలయాళంలో రాసేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన ఘనత కేరళకే దక్కుతుందని ప్రధాని కొనియాడారు. ఆదిశంకరాచార్య, నారాయణ గురు వంటి ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడి నుంచే వచ్చారని మోదీ గుర్తు చేశారు. వామపక్ష, కాంగ్రెస్ కూటములు కేరళలో అధికారాన్ని పంచుకొంటూ  రాష్ట్రాభివృద్ధిని మంటగలిపాయని విమర్శిస్తూ బిజెపికి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేశామని ప్రధాని  భరోసా ఇచ్చారు.