రెజ్ల‌ర్ల ఆరోప‌ణ‌లపై ఢిల్లీ పోలీసుల‌కు సుప్రీం నోటీసులు

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్‌ సింగ్‌పై లైంగిక దాడి ఆరోపణల గురించి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరుతూ ఢిల్లీలో ధర్నా జరుపుతున్న అగ్రశ్రేణి మ‌హిళా రెజ్ల‌ర్లు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటీష‌న్‌ను స్వీక‌రించింది.
 
రెజ్ల‌ర్లు చేసిన ఆరోప‌ణ‌లు చాలా తీవ్ర‌మైన‌వ‌ని, ఈ కేసును శుక్ర‌వారం విచారించ‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది.  ఈ కేసులో ఢిల్లీ పోలీసుల‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్ర‌భుత్వంతో పాటు ఢిల్లీ పోలీసుల‌కు కూడా నోటీసులు ఇచ్చిన‌ట్లు రెజ్ల‌ర్ల త‌ర‌పున న్యాయ‌వాది తెలిపారు.
 
వినేష్‌ ఫోగట్‌తో సహా మొత్తం ఏడు మంది ఆటగాళ్లు పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలిపిన రెజ్లర్లు ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే వరకు అక్కడే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర క్రీడా మంత్రి’త్వశాఖ హామీ ఇచ్చిన తరువాత అథ్లెట్లు జనవరిలో తమ నిరసనను విరమించుకున్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పై ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని వారు పేర్కొన్నారు.
 
‘మాకు న్యాయం కావాలి’ అని రెజ్లర్లు స్పష్టం చేశారు. రెజ్లర్లు జంతర్‌ మంతర్‌లో కఠిక నేలపైనే రాత్రంతా ఉన్నారు. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ మాట్లాడుతూ.. ‘పదేపదే ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ‘మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే నిద్రపోతాం.. భోజనం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
 
మూడు నెలలుగా వారిని (క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఇతర సంబంధిత అధికారాలను) సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే  కమిటీ సభ్యులు స్పందించడం లేదని, తమ ఫోన్‌ కాల్స్‌ కూడా ఎత్తడం లేదని ఆమె వాపోయారు.  `మేము దేశం కోసం పతకాలు సాధించాం. దీనికోసం మా జీవితాన్ని ఫణంగా పెట్టాం’ అని ఆమె పేర్కొన్నాన్నారు.
 
బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లబోమని ఒలింపిక్‌ విజేత బజరంగ్‌ పునియా తెలిపారు. ఈసారి తాము ఎవరినీ తిరస్కరించబోమని, తమ నిరసనకు మద్దతు ఇవ్వదలచిన వారు వచ్చి తమతో చేరవచ్చని ఆమె ప్రకటించారు.