గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిన సైనిక వ్యయం

ప్రపంచ సైనిక వ్యయం గతంలో ఎన్నడూ ఎరుగని గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022లో సైనిక వ్యయం కోసం అత్యధికంగా 2.24 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ తెలిపింది.  వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ప్రపంచ సైనిక వ్యయం పెరిగిందని సైనిక వ్యయంపై స్టాకహేోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఐరోపాలో 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 13 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్‌ల సైనిక చర్యలను ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నప్పటికీ, ఇతర దేశాలు కూడా సైనిక వ్యయం కోసం అధిక శాతం ఖర్చు చేస్తున్నాయని ఎస్‌ఐపిఆర్‌ఐ తెలిపింది. ఇటీవల కాలంలో ప్రపంచ సైనిక వ్యయం నిరంతరం పెరగడం అంటే  మనం అభద్రతతో కూడిన ప్రపంచంలో నివసిస్తున్నామని అర్థమని ఎస్‌ఐపిఆర్‌ఐ సైనిక వ్యయం, ఆయుధాల ఉత్పత్తి కార్యక్రమం సీనియర్‌ పరిశోధకుడు నాన్‌ టియాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

క్షీణిస్తున్న భద్రతా వాతావరణానికి ప్రతిచర్యగా దేశాలు భద్రతా బలగాలను పెంచుతున్నాయని, ఇది భవిష్యత్తులో అత్యధిక వ్యయానికి కారణమౌతుందని ఊహించడం లేదని పేర్కొన్నారు. రష్యా పొరుగున ఉన్న ఫిన్‌లాండ్‌  సైనిక వ్యయంలో 36 శాతం పెరుగుదల ఉండగా, లిథువేనియాలో 27 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది.

2022లో ఉక్రెయిన్‌లో సైనిక వ్యయం ఆరు రెట్లు పెరిగి 44 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని, ఎస్‌ఐపిఆర్‌ఐ డేటాలో ఇప్పటి వరకు నమోదైన దేశాల సైనిక వ్యయాల జాబితాలో అత్యధికంగా ఒకే ఏడాదిలో అనూహ్యంగా పెరిగినట్లు ఆయన తెలిపారు. స్థూల జాతీయోత్పత్తితో పోలిస్తే 2022లో 34 శాతానికి పెరిగిందని, అంతకు ముందు సంవత్సరం 3.2 శాతంగా ఉందని పేర్కొన్నారు.

సైనిక వ్యయం కోసం కేటాయించిన మొత్తంతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. 2022లో అమెరికా సైనిక వ్యయంలో 0.7 శాతం పెరిగి 877 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని, ఇది మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో 39 శాతమని పేర్కొన్నారు.  అలాగే అమెరికా ఉక్రెయిన్‌కు అందించిన ఆర్థిక సైనిక సాయం గతేడాది 19.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని తెలిపారు. 292 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలవగా, 64 బిలియన్‌ డాలర్లతో జపాన్‌ మూడవ స్థానంలో నిలిచింది.  అయితే, భారత్ మూడవ స్థానం నుండి  నాలుగో స్థానంకు చేరుకొంది.