దోపిడీని, మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబొం

ఉత్తరప్రదేశ్ ఎవరి సొత్తు కాదని, దోపిడీని, మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.  శరణాపూర్ నుండి పురపాలక సంఘాల ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభిస్తూ  ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ఎలాంటి అల్లర్లు, కర్ఫ్యూలు లేవని చెబుతూ అంతా ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు.
 
ఇప్పుడు మాఫియా అరాచకాల కారణంగా కాకుండా పెద్ద ఎత్తున జరుగుతున్న పర్వదినాలు, ఉత్సవాలతో ఉత్తర ప్రదేశ్ దేశంలో పేరుపొండుతున్నదని ఆయన గుర్తు చేశారు.  2017కి ముందు ఇక్కడి ప్రభుత్వాలకు అల్లర్లు సృష్టించడం తప్ప వేరే పని ఉండేది కాదని ఆయన విమర్శలు గుప్పించారు.  గతంలో యువతపై ఫేక్ కేసులు పెట్టారని, కానీ ఇప్పుడు యవతకు ఉపాధి మార్గం చూపిస్తున్నామని చెప్పుకొచ్చారు.  గతంలో ఆడపిల్లలు తమ ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యోగి స్పష్టం చేశారు.
 
నేడు ఉత్తరప్రదేశ్‌లో నిర్భయ వాతావరణం ఉందని చెబుతూ రాబోయే అర్బన్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మూడో ఇంజిన్‌ను కనెక్ట్ చేయడం కోసమే అని యోగి వివరించారు. మూడో ఇంజిన్ కనెక్ట్ అయితే ఢిల్లీ నుంచి వచ్చే డబ్బు సద్వినియోగం అవుతుందని ఆయన చెప్పారు.
 
‘మనకు 2017కు ముందు ఉన్న కులతత్వ ప్రభుత్వాలు కావాలా? పేదల సంక్షేమానికి అంకితమైన ప్రభుత్వం కావాలా? నిర్ణయించుకోవాలి. అవినీతి రహిత వ్యవస్థ కావాలో? లేక అవినీతి వ్యవస్థ కావాలో? ప్రజలు నిర్ణయించుకోవాలి. యువత చేతిలో తుపాకులు ఉండాలా? లేక ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు ఉండాలా? అనేది నిర్ణయించుకోవాలి. వీధుల్లో కాల్పుల మోత మోగించాలా? లేక ప్రజల జీవితాల్లో మార్పు రావాలా ? అనేది నిర్ణయించుకోవాలి’ అని యోగి ఆదిత్యనాథ్ సూచించారు.
 
మనకు పోకిరీల దోపిడీ కావాలా? లేదా పేదలకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అందించే వ్యవస్థ కావాలా? అనేది నిర్ణయించుకోవాలి. సేఫ్ సిటీ ఉండాలి. భజన గంగా మన ప్రాధాన్యతగా ఉండాలని కోరారు. మా శాకంభరి ఆశీస్సులు పొందేందుకు ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని చెప్పారు. ఎవరి కులం, మతం, ముఖం చూడకుండానే పథకాల ప్రయోజనాలను అందించామని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
 
2017కి ముందు సహరాన్‌పూర్‌ నిర్లక్ష్యానికి గురైందని యోగి ఆరోపించారు. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సహారన్‌పూర్ ఇప్పుడు దేశంలో కొత్తగా ప్రకాశిస్తోందని చెప్పారు. త్వరలో ఢిల్లీ- సహరాన్‌పూర్‌ ప్రయాణం రెండున్నర గంటలకు తగ్గబోతోందని తెలిపారు. భవిష్యత్తులో సహరాన్‌పూర్‌‌ రూపురేఖలు ఊహించని విధంగా మారతాయని స్పష్టం చేశారు.