కేసీఆర్ ప్రధాని సీటు ఖాళీగా లేదు.. సీఎం సీటు కాపాడుకో

ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు కానీ  ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించుకోవాలని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హితవు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని, దేశానికి  ప్రధానిగా మోదీనే బాధ్యతలు చేపడుతారని స్పష్టం చేస్తూ కేసీఆర్ ముందు తన సీఎం సీటు కాపాడుకుంటే చాలని   ఎద్దేవా చేశారు.

బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన చేవెళ్ల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ  “ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‍గా కేసీఆర్ మార్చారు. తెలంగాణలోనే కేసీఆర్ పని అయిపోనుంది. కానీ ఆయన దేశం గురించి మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. అక్కడ.. ఇక్కడ.. తిరుగుతున్నారు. తెలంగాణ ప్రజలు అంతా అర్థం చేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి కుర్చీ ఖాళీ లేదు. ఆ పీఠాన్ని మళ్లీ నరేంద్ర మోదీనే అధిష్టించనున్నారు” అని అమిత్ షా తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్‌ దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు.   తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

కేంద్రం ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలు సామాన్య ప్రజలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని అమిత్ షా ఆరోపించారు.  కేసీఆర్ ను గద్దే దించే వరకు తమ పోరాటం ఆగదన్న అమిత్ షా సీఎం కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి  వస్తోందని  జోస్యం చెప్పారు.   ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొంటూ  రాష్ట్రంలో అవినీతి సర్కార్ నడుస్తోందని, కేసీఆర్ సర్కార్ పనితీరును దేశం  మొత్తం చూస్తోందని తెలిపారు.

తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుతింటోందని, అవినీతి గంగ ప్రవహిస్తోందంటూ అమిత్ షా ధ్వజమెత్తారు.
 
తెలంగాణ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని,  వాటిని  ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అంటూ కార్యకర్తలను అడిగిన అమిత్ షా సమాధానం ఢిల్లీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వినపడేలా చెప్పాలని కోరారు.
 
మరోవైపు, కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. ఎంఐఎంకు భయపడే బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని జరపట్లేదని ఆరోపించారు. ఓవైసీ ఎజెండానే కేసీఆర్‌ అమలు చేస్తున్నారని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మజ్లిస్ అంటే  తమకు భయం లేదని  అమిత్ షా తెలిపారు.
 
 పేపర్‌ లీకేజీ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ పేపర్ లీక్ ఘటన గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ని అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ఆయన ఏం తప్పు చేశారని బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు.  అరెస్ట్‌లకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం భయపడరని కేంద్ర హోమ్ మంత్రి స్పష్టం చేశారు.
 
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షల మంది యువతకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్‌ లీక్‌ అవుతోందన్న అమిత్ షా ఇలాంటి ఘటనలపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పందిచకపోవటం విడ్డూరమని పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే.. ఏవి పాలు.. ఏవి నీళ్లు అనేది బయటపడుతుందని ఆయన డిమాండ్ చేశారు.