సాత్వికతకు, జ్ఞానానికి మూర్తీ స్వరూపులు రవ్వా శ్రీహరి

కె శ్యామ్ ప్రసాద్
సమరసత జాతీయ సంయోజకులు
 
సాత్వికతకు,జ్ఞానానికి మూర్తీ స్వరూపులు ఆచార్య రవ్వా శ్రీహరి గారు వారికి శ్రద్ధాంజలి.  నల్గొండ జిల్లాకు చెందిన నేటి రాజకీయ భాషలో వెనుక బడిన కులంలో జన్మించారు. తల్లి తండ్రులు పెద్దగా చదువుకోలేదు. అయినా వీరినీ సరస్వతీ మాత కరునించింది.
 
హైదరాబాద్ పాతబస్తీ లోని సంస్కృత కళాశాలలో తెలుగు,సంస్కృతాలలో గొప్ప పండితులు అయ్యారు. అక్కడి కొందరు బ్రహ్మణ పండితులు వీరికి చదువు పట్ల ఆసక్తినీ గుర్తించి ప్రేమగా పాఠాలు చెప్పేరు. ఈ గురువుల పట్ల శ్రీ హరి గారికి ఎంతో గౌరవం.  అయితే హాస్టల్ లో ఆ నాటి ఆచారం ప్రకారం వేరు పంక్తిలో కూర్చోపెట్టే వారట! ఈ వ్యవహారం పట్ల వారు ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఆ విషయం  వారే నాకు పలు సార్లు చెప్పేరు.ఇది ఆయనలో మూర్తీభవించిన సాత్వికతకు గొప్ప ఉదాహరణ.
 
వారికి గల ప్రతిభను చూసి, ఎవ్వరూ రికమెండ్ చేయక పోయినా ఆ నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం  ఉప కులపతిగా నియమించింది. అది ఆ నాటి పాలకుల గొప్పదనం. ఎంత పెద్ద వ్యక్తులు కోరినా, నియమాలకు వ్యతిరేకించినా వారు తల వంచ లేదు (వారే నాతో మాట్లాడిన పలు అంశాలు ఆధారంగా).
 
తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పూజ్య ఉడిపి స్వామీజీ ఏర్పరచిన నిజ నిర్ధారణ కమిటీలో వీరు సభ్యులు. (మాజీ డి.జి.పి.  టి.ఎస్.రావు.,అధ్యక్షులు). తరువాత కాలంలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అధ్యక్షులుగా  టి.ఎస్.రావు అధ్యక్షులుగా, ఆచార్య రవ్వా శ్రీ హరి  ప్రధాన కార్యదర్శిగా విజయవంతంగా ఉద్యమాన్ని నిర్వహించారు.
 
తిరుమల పవిత్రత కోసం రోడ్డుపై ఇద్దరూ ధర్నా కూడా చేశారు. భక్తుల కోరిక మేరకు ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి ఏడు కొండల ప్రాంతాన్ని స్వామి వారి పవిత్ర దివ్య క్షేత్రంగా ప్రకటిస్తూ, ఇక్కడ అన్య మత ప్రచారం నిషేధిస్తూ జీ.ఓ.విడుదల చేసింది.
 
సామాజిక సమరసతా కార్యక్రమాల్లో వారిని పలు సార్లు ఆహ్వానించాను. గుర్రం జాషువా వ్రాసిన ” గబ్బిలం” పద్య కావ్యాన్ని సంస్కృత శ్లోకాల్లో వారు వ్రాసారు. తర్వాత కాలంలో వారి జ్ఞానాన్ని తగు విధంగా ఉపయోగించుకో లేకపోయాం అనే అసంతృప్తి మిగిలిపోయింది.
వారికి హిందూ సమాజం తరఫున హృదయపూర్వక శ్రద్ధాంజలి.