సింహాచలంలో భక్తుల రద్దీతో చేతులెత్తేసిన అధికారులు

 
సింహాచలంలో  స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో  భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర తోపులాట జరిగింది.  రూ. 1500 లైన్లోకి పంపుతుండగా తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లలో చిన్నారులు, వృద్ధులు నలిగిపోయారు. భక్తులను నియంత్రిచడంలో అటు అధికారులు ఇటు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.
అరకొర ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. పోలీస్ కమీషనర్ త్రివిక్రమ వర్మ కలెక్టర్ మల్లికార్జున సమక్షంలోనే ఉద్రిక్తత చోటుచేసుకోవడం గమనార్హం.  ఏడాది మొత్తం చందనం పూతలో ఉండే సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆదివారం (వైశాఖ శుక్లపక్ష తదియ నాడు) భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు.
చందనోత్సవంగా పేర్కొనే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు  తరలివచ్చారు.  వరాహ-నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడి నిజరూపాన్ని కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
 
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సారి చందనోత్సవ ఏర్పాట్లు అధ్వాన్నంగా నిర్వహించారని, గర్భాలయంలో పోలీసుల జులుం ఎక్కువైందని ధ్వజమెత్తారు. గర్భాలయంలో ఆచారాలను మంటగలిపారని మండిపడ్డారు.
 
క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు స్వామి వారి దర్శనానికి ఎందుకు వచ్చానా..? అని బాధపడుతున్నట్లు వెల్లడించారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని స్వామి స్వరూపానందేంద్ర మండిపడ్డారు.
 
ఈసారి అంతరాలయ దర్శనానికి అవకాశం ఉండే రూ.1,500 టికెట్లను స్వయంగా కలెక్టరే జారీ చేయడంతో అవి చిన్నా, చితకా చేతులకు అందలేదు. వాటిని ప్రొటోకాల్‌ అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, శాసనసభ్యులకు మాత్రమే పరిమితంగా అందించారు.  నగరంలో అనేకమంది వ్యాపార ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, దాతలు ఉండగా వారికి కూడా ఈ టికెట్లను ఇవ్వలేదు. చాలా మంది మంత్రుల పేరుతో లేఖలు పట్టుకొని ఈఓ కార్యాలయంపై వెళ్లగా తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.