ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న యర్రగొండపాలెం రాళ్లదాడి

యర్రగొండపాలెం రాళ్లదాడి ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడుపై అతి సమీపం నుంచి రాళ్ల దాడి చేయడం, వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ సమీపం వరకూ రానివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకు పోలీసుల వైఫల్యమే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
 
మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలతో పోలీసులు వైసీపీ కార్యకర్తలను చూసీచూడనట్లు వదిలేశారని పేర్కొంటున్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో ఎన్ఎస్జీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలకు గాయాలు కావడంపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాళ్ల దాడి ఘటనపై గవర్నర్ ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తుంది. గతంలో జరిగిన ఘటనలు, ఈ దాడికి సంబంధించిన విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా రెండు రోజులక్రితం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. అయితే చంద్రబాబు సభపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతిలేని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారని, అందువల్ల ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.

శుక్రవారం చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ చంద్రబాబు, లోకేశ్ దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో తమ మనోభావాలను దెబ్బతిన్నాయని, అందుకు చంద్రబాబు, లోకేశ్ లు దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా నిరసన చేశామని తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి యర్రగొండపాలెంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశామని చెప్పారు.

పైగా, టీడీపీ శ్రేణులే తమపై రాళ్ల దాడి చేశాయని మంత్రి సురేష్ ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ టీ షర్ట్ విప్పి సవాల్ చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు స్పందిస్తూ “మీరు బట్టలు విప్పడం కాదు 2024లో ప్రజలే మీ బట్టలు విప్పే పరిస్థితి వస్తుంది” అని హెచ్చరించారు.

చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అంటూ మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్ బట్టలు విప్పి సవాల్ విసరడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సీఎం జగన్ మెప్పు కోసం కొందరు మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారని అంటూ ఇవాళ ఈ మంత్రి టీ షర్ట్ విప్పితే, రేపు ఇంకో మంత్రి ప్యాంట్ విప్పుతారని, మరోసారి ఇంకో మంత్రి బట్టలన్నీ విప్పుతారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని సూచించారు