నౌకాదళం అమ్ములపొదిలో బాలిస్టిక్ క్షిపణి ఇంటర్‌సెప్టార్‌

దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. ఇప్పటివరకు లేని సరికొత్త తరహా క్షిపణిని ఇది. బాలిస్టిక్ క్షిపణి ఇంటర్‌సెప్టార్‌ టెస్ట్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. తొలిసారి సముద్ర ప్రాంతంలో నౌకపై ఈ పరీక్షను చేపట్టింది.  రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత నౌకాదళం కలిసి బంగాళాఖాతంలో ఈ ప్రయోగాన్ని చేపట్టాయి.
శనివారం ఒడిశా తీరంలో యుద్ధ నౌక పైనుంచి సముద్ర ఆధారిత ఎండో-అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి తొలి పరీక్షను నిర్వహించాయి.  సముద్ర ఉపరితలం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు.  దేశ సముద్ర జలాల సరిహద్దుల్లో దీన్ని మోహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి దానిని అడ్డుకుని నాశనం చేయడం ఈ టెస్ట్‌ ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
శతృదేశాలు ప్రయోగించే ఎలాంటి ఇంటర్ బాల్లిస్టిక్ క్షిపణిని అయినా ఇది ధ్వంసం చేయగలదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. తుఫాన్ల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించగలదని పేర్కొన్నారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిస్సైల్ ఇప్పటివరకు నౌకాదళంలో లేదని, ఇలాంటి మిస్సైల్‌ను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారిగా చెప్పారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ హర్షం వ్యక్తం చేశారు. నౌకాదళ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాలను కలిగి ఉన్న దేశాల జాబితాలో తాము చేరామని తెలిపారు. ఈ ఘటనను ఓ మైలురాయిగా అభివర్ణించారాయన.
 
అత్యాధునిక నెట్‌వర్క్-సెంట్రిక్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో దేశ స్వావలంబనను సాధించిందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత ప్రమాణాలతో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేశామని, ఇది నిర్దేశిత లక్ష్యాన్ని నిర్దేశించిన షెడ్యూల్‌లోనే ఛేదించిందని డాక్టర్ సమీర్ వీ కామత్ వెల్లడించారు.
 
అంతకంటే ముందు డీఆర్డీఓ శతృదేశాల బాలిస్టిక్ క్షిపణిని ధ్వంసం చేయగల భూ-ఆధారిత బాల్లిస్టిక్ మిస్సైల్ డెవలప్‌మెంట్ సిస్టమ్‌ను విజయవంతం చేశామని తెలిపారు.  ఈ పరీక్ష విజయవంతం కావడంతో నౌకాదళంలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్‌ నిలిచింది.
 
కాగా, సముద్ర ఆధారిత ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి తొలి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ టెస్ట్‌ నిర్వహించిన డీఆర్డీవో, ఇండియన్‌ నేవీని ఆయన అభినందించారు. ఈ క్షిపణి రూపకల్పన, అభివృద్ధిలో భాగమైన బృందాలను డీఆర్డీవో చీఫ్ సమీర్ వీ కామత్ ప్రశంసించారు. అత్యంత సంక్లిష్టమైన నెట్‌వర్క్-సెంట్రిక్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో దేశం స్వావలంబన సాధించిందని రక్షణ మంత్రి కొనియాడారు.