ప్రసిద్ధ నిఘంటు నిర్మాత ఆచార్య రవ్వా శ్రీహరి మృతి

సుప్రసిద్ధ సాహితీవేత్త, తెలుగు సంస్కృత భాషా పండితులు ఆచార్య డాక్టర్‌ రవ్వా శ్రీహరి శుక్రవారం (80) అర్ధరాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. వయోభారంతోపాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ప్రాచీన సంస్కృత వ్యాకరణాన్ని సంప్రదాయేతరులూ అభ్యసించవచ్చని నిరూపించిన మహా పండితుడు!
 
నిఘంటువుల్లో లేని పదాలు కనుగొని, కొత్త పదాలతో నిఘంటువు రాసిన ప్రసిద్ధ నిఘంటు నిర్మాత. సంస్కృతంలో పరిశోధనలు, విమర్శనాత్మక గ్రంథాలతో బంగారు పతకం సాధించి వ్యాకరణ సార్వభౌముడిగా పురస్కారం అందుకున్న ప్రముఖ భాషా శాస్త్రవేత్తగా పేరొందారు.  శ్రీహరి భార్య పేరు అనంతలక్ష్మి. వీరి కుమారులు రమేశ్‌, శివకుమార్‌, పతంజలి అమెరికాలో స్థిరపడ్డారు. ఆదివారం ఉదయం వారు హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు సమాచారం. అదేరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
శ్రీహరి స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం. నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఐదో తరగతిలోనే చదువును మానేసి కుల వృత్తి చేపట్టాల్సి వచ్చింది. అంతలోనే అనుకోని ఘటన సంస్కృత విద్యా పీఠంలో చేరేలా చేసింది. ఆ రోజుల్లో ఓ దినపత్రికలో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠం ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యా పీఠంలో చేరి సంస్కృతం నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని, ఫీజులు ఉండవని, ఐదేళ్లు చదివితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొంది.
సంస్కృత విద్యాపీఠానికి సురవరం ప్రతాప రెడ్డి, మందుముల నర్సింగరావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి సభ్యులు. దాంతో సురవరం ప్రతాపరెడ్డిని శ్రీహరి కలిశారు. తనకు ఎలాగైనా సీటు కావాలని కోరారు. అక్కడికక్కడే ఒకటి రెండు పరీక్షలు నిర్వహించి ఆయనను ఎంపిక చేశారు.  మొదట్లో శ్రీహరికి సంస్కృతం అంటే ఏమిటో, చదివితే ఎలాంటి లాభం ఉంటుందో తెలియదు. కానీ, చేనేత వృత్తిలో కొనసాగడం ఇష్టం లేక సంస్కృత పాఠశాలలో చేరారు. కఠోర నియమ నిబంధనలతో సంస్కృత జ్ఞానాన్ని పెంచుకున్నారు. తర్వాత సీతారాంబాగ్‌ సంస్కృత కళాశాలలో డీవోఎల్‌, బీవోఎల్‌ వ్యాకరణం అభ్యసించారు.

శతకోప రామానుజాచార్యుల శిష్యరికంలో తర్క, వ్యాకరణ, విశిష్ట అద్వైత, వేదాంత శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. పతంజలి ‘మహా భాష్యాంతర’ వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. అనంతరం తెలుగు పండిట్‌ కోర్సు, ఆపై బీఏ, ఎమ్మే పూర్తి చేశారు. బిరుదురాజు రామరాజు సూచనతో ‘భాస్కర రామాయణం’ పరిశోధన చేసి, ఓయూ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

తొలినాళ్లలో వివేకవర్థిని, ఆంధ్ర సారస్వత పరిషత్‌ ప్రాచ్య కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ రీడర్‌గా, కోఠి మహిళా కళాశాల, సికింద్రాబాద్‌ పీజీ కళాశాలల్లో అధ్యాపకుడిగా చేశారు.  హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా, తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్‌గా 17ఏళ్లు సేవలందించారు. కుప్పం, ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా, టీటీడీ ప్రచురణల విభాగం ప్రధాన సంపాదకుడిగా విశిష్ఠ సేవలందించారు.

పలు ధార్మిక, సాంస్కృతిక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తిరుమల క్షేత్ర పవిత్రత పరిరక్షణ ఉద్యమంలో ముందుండి నేతృత్వం వహించారు. మహా భారతం, భాగవతాలను వ్యాఖ్యానాలతో సహా ప్రచురించారు. తిరుమల క్షేత్రదర్శిని, బ్రహ్మమొక్కటే, ప్రాచీన భారతీయ సంస్కృతి పుస్తకాలను టీటీడీ వెలువరించింది.

సూర్యరాయాంద్ర నిఘంటు శేషం ‘శ్రీహరి నిఘంటువు’, ‘అన్నమయ్య పదకోశం’, ‘సంకేత పదకోశం’, ‘నల్గొండ జిల్లా మాండలిక పదకోశం’, ‘వ్యాకరణ పదకోశం’ వంటి నిఘంటువుల ద్వారా తెలుగు పద సంపదను తన దోసిలితో భావితరాల ముంగిట రాశులుగా పోసిన ప్రజ్ఞామూర్తి రవ్వా శ్రీహరి.  ఆయన 40కిపైగా గ్రంథాలు రాశారు.  సినారె ప్రపంచ పదుల్ని సంస్కృతంలోకి అనువదించారు. దానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

శ్రీహరి నిఘంటు నిర్మాణానికిగాను తెలుగు వర్సిటీ పురస్కారం, తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి మహా మహోపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఎన్టీఆర్‌, చిన్నయసూరి జాతీయ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. శ్రీహరి మృతి పట్ల ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈకాలం వాల్మీకి రవ్వా శ్రీహరి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీ శంకర్‌ కొనియాడారు.