ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌

నెల రోజుల పాటు పంజాబ్​ పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరిగిన వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్​ పాల్ సింగ్ ఎట్టకేలకు  లొంగిపోయాడు. పంజాబ్‌లోని మోగాలో ఆదివారం ఉదయం అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన స్వగ్రామానికి శనివారం రాత్రి చేరుకున్న అమృత్‌పాల్ సింగ్.. ఈ ఉదయం అక్కడ స్థానికులు కొందరితో మాట్లాడాడు.
అమృతపాల్ సింగ్ గత రాత్రి తన గ్రామమైన జల్లుపూర్ ఖేరా చేరుకుని ఉదయం ప్రార్థనలు చేసినట్లు తెలిసింది. అతడి గురించి సమాచారం అందడంతో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక పోలీసులకు లొంగిపోయాడు. “పంజాబ్​ మోగాలో అమృత్​ పాల్​ను అరెస్ట్​ చేశాము. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాము. ఎలాంటి ఫేక్​ న్యూస్​ వ్యాపించవద్దని ప్రజలకు సూచిస్తున్నాము. ప్రజలు శాంతియుతంగా ఉండాలి,” అని పంజాబ్​ పోలీస్​ విభాగం ట్వీట్​ చేసింది.

మోగాలో రోడ్​ విలేజ్​లోని ఓ గురుద్వారాలో పోలసులకు అమృత్​ పాల్​ లొంగిపోయినట్టు తెలుస్తోంది. అమృత్​ పాల్​ సింగ్​ను అసోంలోని డిబ్రుఘడ్​కు తరలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ‘వారిస్​ పంజాబ్​ దే’ చీఫ్​ మద్దతుదారుల్లో 8 మంది జాతీయ భద్రతా చట్టం కింద ఇప్పటికే అక్కడి జైలులో ఉన్నారు.

మార్చి 18న జలంధర్ సమీపంలో పోలీసులకు చిక్కినట్టే చిక్కి తన సహచరుడి పపల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి బైక్‌పై అమృత్‌పాల్‌ పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పంజాబ్ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. అమృత్‌పాల్‌ అరెస్ట్‌తో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మోగాతో పాటు అతడి స్వగ్రామం జల్లుపుర్ ఖేరాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇప్పటికే అమృతపాల్ వ్యవహారానికి సంబంధించి వందమంది వరకు అరెస్టు అయ్యారు. అమృత్​సర్​ విమానాశ్రయం నుంచి లండన్​కు తప్పించుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయింది అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్​దీప్​ కౌర్​. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే వారిస్​ పంజాబ్​ దే చీఫ్​ పోలీసులు ఎదుట లొంగిపోయాడు.

ఖలిస్థానీ దేశం కోసం విపరీతంగా ప్రచారాలు చేస్తున్న వారిలో ఈ అమృత్​ పాల్​ ఒకడు.  ఈ ఏడాది ఫిబ్రవరి 24న అమృత్​ పాల్​ మద్దతుదారుడు, ఓ కిడ్నాప్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లవ్​ప్రీత్​ సింగ్​ తూఫాన్​ను పోలీసులు అరెస్ట్​ చేయగా అమృత్​ పాల్​ మద్దతుదారులు భారీ కత్తులు, తుపాకులతో అంజాలా పోలీస్​ స్టేషన్​పై దాడి చేశారు.

 ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అప్పటి నుంచి అమృత్​ పాల్​పై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే.ఖలిస్థానీ దేశం కోసం అమృత్​ పాల్​ చేస్తున్న ప్రచారాలు బయటపడ్డాయి.

ఫలితంగా అతడిని అరెస్ట్​ చేసేందుకు పంజాబ్​ పోలీసులు రంగంలోకి దిగాడు. కానీ చాకచక్యంగా తప్పించుకుని మాయమైపోయేవాడు. ఉత్తరాఖండ్​, హరియాణా పోలీసులు సైతం అప్రమత్తమై అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఓవైపు అతడి కోసం అన్వేషిస్తూనే, మరోవైపు అతడి మద్దతుదారులు, సన్నిహితులు, కుటుంబసభ్యులను విచారించడం మొదలిపెట్టారు.