అజిత్ పవార్ బిజెపి వైపు అడుగులు వేస్తున్నారా!

మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  శివసేనతో చెలరేగిన తిరుగుబాటు కారణంగా గత ఏడాది శివసేన నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కూడిన మహా వికాస్‌ అఘాడి కూటమి  అధికారాన్ని పోగొట్టుకొని, ఎకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు శివసేన వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే.
 
2019లో అసెంబ్లీ ఎన్నికలు కాగానే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బిజెపి ప్రభుత్వంలో చేరేందుకు శివసేన విముఖత వ్యక్తం చేయగా, ఎన్సీపీ పక్ష నేతగా అజిత్ పవార్ మద్దతు తెలపడంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అందుకు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, ఎన్సీపీ ఎమ్యెల్యేలు వెనుకడుగు వేయగా, ఆ ప్రభుత్వం వెంటనే కూలిపోయింది.
 
ఆ సమయంలో శరద్ పవార్ చొరవతోనే శివసేనతో కలిసి మూడు పార్టీలు మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఎన్సీపీ మద్దతుతో ఆ ప్రభుత్వం రెండేళ్లపాటు కొనసాగింది. అయితే ఇప్పుడు ఎన్సీపీలోనే బీటలు వారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి ఇస్తే 40 మందికి పైగా ఎమ్యెల్యేలతో బీజేపీతో చేతులు కలిపేందుకు అజిత్ పవర్ సిద్ధంగా ఉన్నట్లు కధనాలు వచ్చాయి.
 
ఈ కథనాలను శరద్ పవార్, అజిత్ పవర్ త్రోసిపుచ్చిన్నప్పటికీ అప్పటి నుండి అజిత్ పవార్ ఎన్సీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం స్పష్టం అవుతుంది. శుక్రవారం ముంబైలో జరిగిన ఎన్సీపీ కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు.  పూణేలో మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పైగా,  మహారాష్ట్రలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి ఉండటం ఎందుకు, సీఎం పదవికి ఇప్పుడు కూడా సిద్ధమేనని ఆయన చెప్పడం కలకలం రేపుతోంది.

గత 20 ఏళ్లుగా ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి మాత్రమే దక్కడంపై అజిత్‌ పవర్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ 2004లో సీఎం పదవిని ఎన్సీపీ చేపట్టాల్సి ఉందని చెప్పారు. నాడు ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయని చెప్పారు. ఎన్సీపీ 71 స్థానాల్లో, కాంగ్రెస్‌ 69 స్థానాల్లో గెలిచాయని గుర్తు చేశారు.

దీంతో సీఎం పదవిని ఎన్సీపీ నేత చేపడతారని కాంగ్రెస్‌తో సహా అంతా భావించారని తెలిపారు. తన సహోద్యోగి దివంగత ఆర్‌ఆర్‌ పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యేవారని పేర్కొన్నారు. అయితే ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని ఢిల్లీ నుంచి సందేశం వచ్చిందని  అంటూ పరోక్షంగా కాంగ్రెస్ పై మండిపడ్డారు.

ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక సీట్లు గెలిచిందని, దీంతో సీఎం పదవి ఆ పార్టీ వద్దే ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్‌తో కంటే శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంతో కలిసి సంతోషంగా పని చేసినట్లు చెప్పారు. మరోవైపు 2022 జూన్‌లో శివసేన నాయకత్వంపై తిరుగుబాటుకు ముందు ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నారని అజిత్‌ పవార్‌ తెలిపారు. ఆయన మనస్సులో ఏదో జరుగుతోందన్న సంగతి తనకు కూడా తెలుసని చెప్పారు.

డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో అజిత్‌ పవార్‌కు ఉన్న అనుబంధం గురించి కూడా మీడియా ప్రశ్నించగా  జూలై 22న పుట్టడమే తమ ఇద్దరి మధ్య ఉన్న కామన్‌నెస్‌ అని పేర్కొన్నారు. రాజకీయ, సైద్ధాంతిక పరంగా తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తాము శత్రువులం కాదని స్పష్టం చేశారు. ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే తమ తమ ప్రసంగాలలో ఒకరిపై ఒకరు విమర్శించుకున్నప్పటికీ మంచి స్నేహితులని గుర్తు చేశారు.

ఇలా ఉండగా, అజిత్‌ పవార్‌కు అపారమైన పరిపాలన అనుభవం ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థుడని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గంపై చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ కితాబు ఇవ్వడం ఆసక్తి కలిగిస్తుంది. పవార్‌ ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రిని కావాలన్న కోరికను వెలిబుచ్చారని అంటూ ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.