రోడ్ మ్యాప్ పవన్ కూడా ఇవ్వొచ్చు

ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన, బీజేపీ పరస్పరం గౌరవించుకుంటూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామని బిజెపి ఏపీ కోర్ కమిటీ సమావేశం స్పష్టం చేసింది. రాజమండ్రిలో జరిగిన సమావేశం వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్ మీడియాకు తెలుపుతూ 
రోడ్ మ్యాప్ బీజేపీయే ఇవ్వాల్సిన అవసరంలేదని పవన్ కల్యాణ్ కూడా ఇవ్వొచ్చని తేల్చి చెప్పారు.
 
టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ను బీజేపీ బెదిరిస్తుందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పొత్తులపై ఎలా వెళ్లాలన్నది బీజేపీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతోందన్న ఆయన జనసేనతో ఉమ్మడి కార్యక్రమాల రూపకల్పన చేస్తామని వెల్లడించారు. వైసీపీతో బీజేపీ కలిసి కట్టుగా వెళ్తోందని అసత్య ప్రచారం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
 
కాగా, వైసీపీ ప్రభుత్వ ప్రధాన వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకూ పది రోజులు పాటు పోరాటం చేస్తామని మాధవ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఛార్జ్ షీట్ లు దాఖలు చేస్తామని తెలిపారు. బీజేపీ వైసీపీకి అనుకూలం అనే పరిస్థితిని అధిగమిస్తామని చెబుతూ మే 15 నుంచి జూన్ 15 వరకు రాష్ట్రంలో బీజేపీ ప్రచార భేరి నిర్వహిస్తామని వివరించారు.

ఏపీలో అరాచక పరిపాలన జరుగుతుందని మాధవ్ విమర్శించారు. వ్యవస్థలు నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ అరాచకాలపై కోర్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. భూ దందాలు, కబ్జాలు, ఇసుక మాఫియా, మద్య నిషేధంపై ఉద్యమం చేయాలని నిర్ణయించామని చెప్పారు. మే 5 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఛార్జ్ షీట్ లు విడుదల చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

వైసీపీతో బీజేపీ కలిసి కట్టుగా వెళ్తుందన్న ప్రచారాన్ని తిప్పి కొడతామని మాధవ్ స్పష్టం చేశారు. గతంలో టీడీపీ కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందన్న ఆయన బీజేపీ కుటుంబ పాలన పార్టీలకి వ్యతిరేకమని తేల్చి చెప్పారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఏదో ఊహించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.