పీఎస్‌ఎల్‌వీ-సి55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ఈరోజు నింగిలోకి దూసుకెళ్లింది. ఆ రాకెట్ ద్వారా సింగ‌పూర్‌కు చెందిన రెండు ఉప‌గ్ర‌హాల‌ను ఇస్రో ప్ర‌యోగించింది. శనివారం మధ్యాహ్నం 2:19 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన 20 నిమిషాల తర్వాత కక్ష్యలోకి శాటిలైట్స్ ప్రవేశించాయి. ఇస్రో నాలుగు దశల్లో శాటిలైట్స్ ను నింగిలోకి ప్రవేశపెట్టారు.

రెండు ఉప‌గ్ర‌హాలను నిర్ధిష్ట కక్ష్య‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్టారు. 228 ట‌న్నులు ఉన్న పీఎస్ఎల్వీ 57వ సారి అంత‌రిక్షంలోకి వెళ్లింది. శ్రీహ‌రికోట‌లో ఉన్న స‌తీస్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి దీన్ని విజయవంతంగా ప్ర‌యోగించారు. రెండు ఉప‌గ్ర‌హాలు సుమారు 757 కిలోల బ‌రువు ఉన్నాయి.  ఈ ఏడాది ఇస్రో చేపట్టిన మూడ‌వ అతిపెద్ద ప్ర‌యోగం ఇది.  ఈ ఉపగ్రహంలో సింథటిక్‌  ఎపర్చరు రాడార్‌ పేలోడ్‌ను ఉంచారు. దాంతో అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించడానికి సాయపడుతుంది.
16 కిలోల బ‌రువు ఉన్న లూమాలైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం ఈ సాటిలైట్ లక్ష్యం. వాటితో పాటు భారత్ కు చెందిన రెండు ఉపగ్రాహలను నింగిలోకి పంపించింది. ఈ ఉపగ్రహాలు భూమికి 586 కిలోమీటర్ల ఎత్తులో.. భూమి చుట్టూ తిరగనున్నాయి.
ఏడాదికి 12 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. ఈ ఏడాది ఇస్రోకిది తొలి పీఎస్‌ఎల్వీ ప్రయోగం కాగా, ఈ సిరీస్‌లో 57వ ప్రయోగమని చెప్పారు. వాణిజ్య రంగ ప్రయోగాల్లో ఇది ఐదోదని పేర్కొన్నారు.  ఈ ప్రయోగానంతరం జీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా నావికా ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని, ఆ తర్వాత కీలకమైన చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రయోగాలు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇకపై ప్రతినెలా ఒక ప్రయోగం ఉంటుందని పేర్కొన్నారు.
 
ఇదిలా ఉండగా, పీఎస్‌ఎల్వీ-55 ప్రయోగంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌ తమ పరికరాలను పరీక్షించనుంది. శాటిలైట్‌ ఆర్బిటాల్‌ డిప్లయర్‌ (డీఎస్‌ఓడీ)కు సంబంధించిన రెండు వేరియంట్లు, ఉపగ్రహ ఆధారిత డేటా రిలే కార్యక్రమాలను ఉపయోగపడే రేడియో ప్రీక్వెన్సీ మాడ్యూల్‌ను ఈ స్టార్టపే అందించింది.