విదేశీ కరెన్సీ డిపాజిట్లపై టిటిడికి ఊరట

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే  కరెన్సీకి బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. విదేశీ  కరెన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది.

భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని కోరింది   సెక్షన్ 50 ప్రకారం  టీటీడీకి మాత్రమే ఈ అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవోకు సమాచారం ఇచ్చింది. విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి టీటీడీ కేంద్ర హోం శాఖ నుంచి ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద లైసెన్సు పొందింది.

దానివల్ల 2018 వరకూ విదేశీ కరెన్సీ మారకానికి ఆర్‌బీఐ అనుమతించేది. ఎస్‌బీఐ కూడా విదేశీ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ చేసేది. 2018లో లైసెన్సు గడువు ముగిసింది. దాని రెన్యువల్‌పై టీటీడీ దృష్టి సారించలేదు. కేంద్ర హోం శాఖలోని ఎఫ్‌సీఆర్‌ఏ విభాగం 2019లో దీన్ని గుర్తించింది. లైసెన్సు లేకపోయినా టీటీడీ విదేశీ విరాళాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్ల జరిమానా విధించింది.

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి 2020లో చేసిన సవరణల ప్రకార విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు వినియోగించుకోకూడదు. కానీ టీటీడీ వినియోగించుకోవడంపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ ఫార్మాట్‌లో ఇవ్వలేదని తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో జరిమానా మొత్తం రూ.4.33 కోట్లకు చేరుకుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన హుండీలో వేసే నగదు లేదా ఖరీదైన లోహాలు, ఇతర వస్తువులకు భక్తులు ఎలాంటి లెక్కలూ చెప్పాల్సిన పనిలేదు. తరచూ భారీ మొత్తాల్లో అజ్ఞాత భక్తులు నగదు వేస్తుంటారు. అదే సమయంలో విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న భక్తులు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు.

వాటిలో ఆయా దేశాల కరెన్సీ కూడా ఉంటుంది. గతంలో ఆ విదేశీ నగదును ఆర్‌బీఐ ద్వారా టీటీడీ మన కరెన్సీలోకి మార్చుకునేది. 2018 తర్వాత అలా మారకానికి ఆర్‌బీఐ అంగీకరించడం లేదు. దానికి తోడు విదేశీ కరెన్సీని ఎస్‌బీఐ టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ చేయడానికీ ఒప్పుకోవడం లేదు.  ఫలితంగా 2018 నుంచీ ఇప్పటి వరకూ సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో జమ కాకుండా ఎస్‌బీఐ వద్ద మూలుగుతోంది. ఇప్పుడు లైసెన్సు రెన్యువల్‌ కావడంతో పాటు దాతల పేర్లు తెలుపకుండా మినహాయింపు ఇవ్వడంతో టిటిడికి  పెద్ద ఊరట లభించినట్లయింది.