టీటీడీ విజిలెన్స్‌ వలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ప్రజా ప్రతినిధులకు, వారు సిఫార్సు చేసిన వారికి టిటిడి సమకూరుస్తున్న ప్రత్యేక దర్శన సదుపాయాలను సొమ్ము చేసుకొంటూ ఒక ఎమ్యెల్సీ టీటీడీ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పైగా, ఆ విధంగా పట్టుబడ్డ ఎమ్యెల్సీ ఉపాధ్యాయుల నుండి ఎన్నికైన వ్యక్తి కావడం గమనార్హం.  విజిలెన్స్‌ వలలో  ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పట్టుబడ్డారు.
 
ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తరచు శ్రీవారి దర్శనానికి వస్తుండడంతో అనుమానించిన టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దానితో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది. పోర్జరీ ఆధార్‌ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్టు గుర్తించింది.
 
ఆరుగురి దర్శనం కోసం లక్షా 5 వేల రూపాయలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ డ్రైవర్‌ ఖాతాకు సదరు భక్తులు పంపారని విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు. ఇక, నెల రోజుల వ్యవధిలో 19 సిఫార్సు లేఖలు జారీ చేశారట ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ. ప్రతి సిఫార్సు లేఖను ఎమ్మెల్సీ ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకే ఇచ్చినట్లు టీటీడీ విజిలెన్స్‌ గుర్తించింది.
 
భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీలో ద‌ళారుల ఏరివేత చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశామ‌ని, టికెట్ల అమ్మ‌కానికి పాల్ప‌డే వ్య‌క్తులు ఎంత‌టి వారైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈవో ధ‌ర్మారెడ్డి ఈ సందర్భంగా హెచ్చ‌రించారు. ఇందుకు ఎమ్మెల్సీపై కేసు న‌మోదే ఉదాహ‌ర‌ణగా ఆయ‌న చెప్పుకొచ్చారు.