అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే

 
వైఎస్ వివేకా హత్య కేసులో కడప  ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది.  హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో సిబిఐ అరెస్ట్ చేస్తుందని అవినాష్ తరపు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేయడంతో సోమవారం వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సూచించింది.
 
అవినాష్‌ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం వరకు అవినాష్‍రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూనే, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది.
 
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పేలవంగా ఉన్నాయన్న సుప్రీం కోర్టు, ఈ వ్యవహారంపై సోమవారం మరోసారి విచారణ చేపడతామని ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న అవినాష్ తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారమే ఈ వ్యవహారంపై నిర్ణయాన్ని వెలువరిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ ఆయన కుమార్తె డా. నర్రెడ్డి సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ సవాలు చేస్తూ డా.సునీత దాఖలు చేసిన పిటిషన్‍లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చారని, జగనే నిందితునికి క్లీన్ చిట్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని ఆమె ఆరోపించారు.

అవినాశ్ రెడ్డి పేరు వచ్చిన తర్వాతే జగన్ యాక్టివ్ అయ్యారని ఆమె ఆరోపించారు. ఛార్జిషీటులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు రావడంతో అవినాశ్ రెడ్డిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహా ప్రముఖులు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారన్న డా.సునీత ఆరోపించారు.