నేటి నుండే గంగా పుష్కరాలు

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా పుష్కరాలు శనివారం   ప్రారంభంకానున్నాయి. 12ఏళ్లకి ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు మే 3 వరకు కొనసాగనున్నాయి. అలహాబాద్‌, గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ సంగమం ప్రయాగ నగరాలలో పుష్కరాల సంరంబం ఆరంభమవుతున్నది.

పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో స్నానమాచరిస్తే సకల పాపాల నుంచి విముక్తమవుతామని ప్రతీతి. ఈ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారని చెప్తారు. రోజుకు 25 లక్షల దాకా జనం గంగా స్నానం ఆచరిస్తారు. కనీసం కోటి మంది నిత్యం పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటుంటారు.

గంగానది పుట్టింది మొదలు సముద్రంలో కలిసే దాకా ప్రతీది భారతీయులకు పవిత్రం. గంగా ఒడ్డున ఎన్నో నాగరికతలు పుట్టాయి. మరెన్నో సామ్రాజ్యాలు వెలిశాయి.  ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బృహస్పతి సంవత్సరంలో ఒక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే.. ఒక రాశిలో ప్రవేశించిన తర్వాత, తిరిగి అదే రాశిలో సంచరించాలంటే 12ఏళ్లు పడుతుంది.

ఈ నేపథ్యంలో శనివారం మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. ఇది హిందువులకు అత్యంత పవిత్రం. దీనినే గంగా పుష్కరాలు అని పిలుస్తారు.  బృహస్పతి సంబంధిత రాశిలోకి ప్రవేశించిన తొలి 12రోజులను ఆది పుష్కరాలని, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలుస్తారు. బృహస్పతి మీనరాశిలో ప్రవేశించినప్పడు అంటే 2023, మే 3న గంగానది పుష్కరాలు ముగుస్తాయి.

ఉత్తరాఖండ్​లో జన్మించిన గంగా నది పలు రాష్ట్రాల్లో ప్రవహించి, చివరికి సముద్రంలో కలుస్తుంది. ఈ మార్గంలో అనేక పుష్కర ఘాట్​లు ఉన్నాయి. గంగానదికి చాలా పేర్లున్నాయి. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అంటారు. జహ్ను పొట్టంలోంచి పుట్టింది కాబట్టి జాహ్నవిగా కూడా పిలుస్తారు. భారతీయులు ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే గంగా ప్రధానమైనది.

కాశీనాథుడు కొలువుదీరిన పవిత్ర వారణాసి క్షేత్రంలో గంగాపుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలోకి మణికర్ణిక ఘాట్‌ ముఖ్యమైనది. ఎండా కాలం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే రీతిలో అధికారులు చర్యలు తీసుకున్నారు. అనేక పుష్కర ఘాట్​లలో మంచి నీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, బట్టలు మార్చుకోవడం కోసం ప్రత్యేక రూమ్​లు సిద్ధం చేశారు.

స్నానాలకు వెళ్లి గంగా నదిలో ప్రమాదవశాత్తు పడిపోతే వెంటనే రక్షించే విధంగా ఆయా ఘాట్​లలో రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు అధికారులు. అదే సమయంలో వైద్య బృందాలు సైతం గంగా పుష్కరాల వేళల్లో సేవలు అందించనున్నాయి. పోలీసు విభాగాలు నిత్యం నిఘా ఉంచనున్నాయి. హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే కాశీలో పుష్కరాల కోసం మరింత ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రజల తాకిడి అనుకున్న దాని కన్నా ఎక్కువగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. సాధారణ సదుపాయాలతో పాటు స్థానిక స్కూళ్లు, వసతి గృహాలు, ఆశ్రమాల్లో పూర్తి ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్​, బస్టాండ్​ల నుంచి ప్రజలు పుష్కర ఘాట్​లకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రవాణా వ్యవస్థను రూపొందించారు.

మరోవైపు, గంగా పుష్కరాల్లో పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి గంగా నది పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. శనివారం నుంచి మే 3 వరకు కొనసాగే ఈ పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు ఆయా ప్రాంతాల్లో నివాసాలు, భోజనం వంటి వాటికోసం స్థానికంగా ఉండే దక్షిణాది హోటల్స్​, సత్రాలు.. ఇప్పటికే ప్రకటనలు సైతం చేశాయి.