కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే

ఇప్పటికిప్పుడు భారత్ లో లోక్‌సభ ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేదే అధికారమని  టైమ్స్ నౌ గ్రూప్‌లోని మహారాష్ట్రకు చెందిన నవభారత్ టైమ్స్ సర్వే తేల్చింది. ఎన్డీయేకు 292 నుంచి 338 సీట్ల వరకు వస్తాయని వెల్లడించింది. అయితే, ఈ ఎన్నికలతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య పెరుగుతుందని సర్వే తేల్చింది. ఈటీజీ రీసెర్చ్ సంస్థతో కలిసి ఈ సర్వే చేసింది

రాహుల్ గాంధీ అనర్హత, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, కొంత ప్రభుత్వ వ్యతిరేకతల ప్రభావంతో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి 106 నుంచి 144 వరకు ఎంపీ స్థానాలు దక్కవచ్చని ఆ సర్వే పేర్కొంది.  ప్రతిపక్షాలన్నీ కూటమిగా మారినా బీజేపీ గెలుపును అడ్డుకోలేవని వారు అంటున్నారు.

అంటే ప్రతిపక్షాలు అంత బలహీనంగా ఉన్నాయన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇందుకు వారు 3 అంశాలు చెబుతున్నారు. ఒకటి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలంగా లేదంటున్నారు. అలాగే ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదంటున్నారు. ఇక స్థిరమైన పాలన అందిస్తూ ఉండటం వల్ల మళ్లీ బీజేపీకే ప్రజలు పట్టం కడతారని అంటున్నారు.

అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎవరిని ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్నారంటే  అత్యధికంగా 64% మంది మోదీ అని చెప్పారు.  ఆ తర్వాత రాహుల్ గాంధీకి 13%, కేజ్రీవాల్ కు 12%, నితీశ్ కుమార్ కు 6%, కేసీఆర్ కు 5% మంది ఓటేశారు.   మరోవైపు, రాహుల్ గాంధీ పై విధించిన అనర్హత వేటు రాహుల్ గాంధీకి సానుకూలంగా పరిణమిస్తుందా? అన్న ప్రశ్నకు 23 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. 39% మంది మాత్రం ఆ ప్రభావం ఎన్నికలపై ఉండబోదని స్పష్టం చేశారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలంతా ఏకమైనా ప్రధాని మోదీకి గట్టి పోటీ ఇవ్వలేరని సర్వేలో అత్యధికంగా 49% మంది అభిప్రాయపడ్డారు. 19% మంది మాత్రం కొంత వరకు గట్టి పోటీ ఇవ్వగలరని చెప్పారు. 17% మంది మాత్రమే ప్రతిపక్షాలు ఏకమైతే మోదీకి దీటుగా పోటీ ఇవ్వగలరని పేర్కొన్నారు. ఇక మిగిలిన 15% మంది మాత్రం ఏ విషయమూ చెప్పలేమన్నారు

వైఎస్సార్సీపీకి 25 సీట్లు

కాగా, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాలను నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయనుందని ఈ సర్వే తేల్చడం విశేషం.

మరోవైపు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ 20 నుంచి 22 సీట్లు గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది. అలాగే, ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్ కు 11 నుంచి 13 సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే, ఇతరులు 50 నుంచి 80 సీట్లు గెల్చుకుంటారని వెల్లడించింది. దేశంలో అవినీతిపై సీబీఐ, ఈడీ పనితీరు బాగుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాతే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడవచ్చని కూడా ఎక్కువ మంది చెప్పారు.