పూంచ్లో ఉగ్ర దాడిలో చైనా హస్తం!

జమ్ముకశ్మీర్​ లోని  పూంచ్ జిల్లాలో ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సైనికుల ట్రక్​పై దాడి జరిపి, ఐదుగురి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అధికారులు అనేక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఘటనా స్థలంలో చైనాకు సంబంధించిన బుల్లెట్లను ఆర్మీ అధికారులు కనుగొన్నారు.
దాంతో ఉగ్ర దాడిలో చైనా హస్థం ఉందా? ఉగ్ర వాదులతో చేతులు కలిపే చైనా ఈ దుస్సాహసానికి పాల్పడిందా? అన్న కోణంలో ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ దాడిని తామే చేసినట్లు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు జైషే మహ్మద్ సంస్థతో అనుబంధాలు ఉన్నాయి.
మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్​ఐఏ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎన్​ఐఏ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు సైనికులలో నలుగురు పంజాబ్​కు చెందిన వారే ఉన్నారు. మృతిచెందిన జాబితాల్లో హ‌వ‌ల్దార్ మ‌ణ్‌దీప్ సింగ్‌, లాన్స్ నాయ‌క్ దేబ‌శిశ్ భ‌స్వాల్‌, లాన్స్ నాయ‌క్ కుల్వంత్ సింగ్‌, సిపాయి హ‌రికిష‌న్ సింగ్‌, సిపాయి సేవ‌క్ సింగ్‌లు ఉన్నారు.

ఆర్మీ, పోలీసు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయని ర‌క్ష‌ణ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉగ్ర‌వాదులు పాక్‌లోని ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ‌కు చెందిన ఉంటార‌ని భావిస్తున్నారు. తొలుత ఇది ట్రక్​కు జరిగిన ప్రమాదమని అందరు భావించారు. కానీ ఇదొక ఉగ్రదాడి అని తేలింది.

ట్రక్​పై 25కి పైగా బుల్లెట్​లు ఉన్నాయి. దీని బట్ ట్రక్​కు నలువైపుల నుంచి దాడి జరిగినట్టు స్పష్టమైంది.  ఘ‌ట‌న‌లో ఏడుగురు ఉగ్ర‌వాదుల హ‌స్తం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజౌరీ-పూంచ్ సెక్టార్ల‌లో రెండు గ్రూపులుగా ఉగ్ర‌వాదులు ఆప‌రేట్ చేస్తున్న‌ట్లు అనుమానిస్తున్నారు.

బాట‌-దోరియా ప్రాంతంలో ప్ర‌స్తుతం ఉగ్ర‌వాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు మొద‌లైంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని మొత్తం చ‌ట్టుముట్టేశారు. డ్రోన్లు, స్నిఫ‌ర్ శున‌కాల ద్వారా ఉగ్ర‌వాదుల కోసం గాలిస్తున్నారు. అదే ప్రాంతంలో దాక్కున్న ఉగ్ర‌వాదుల్ని ప‌ట్టుకోవాల‌న్న ఉద్దేశంతో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఉగ్రవాదులు తప్పించుకోలేకుండే ప్రణాళికలు రచించారు.