విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామని, అది ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని కొన్ని రోజులుగా ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వ నేతలు ఒక టెండర్ కు బీడ్ వేసే విషయంలో చివరి నిమిషం చేతులెత్తేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కోసం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈవోఐ) దాఖలుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది.

తమ సంస్థ బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కేంద్రాన్ని కోరింది. సింగరేణి కోర్కె  మేరకే ఈనెల 15నే ముగియాల్సిన టెండర్ల దాఖలు ప్రక్రియ గడువును ఐదు రోజులు పెంచారు. బిడ్ దాఖలుపై సింగరేణి ఉన్నతాధికారులు రెండు, మూడు రోజులుగా వైజాగ్ లోనే మకాం వేసి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

కానీ గురువారం మధ్యాహ్నం గడువు ముగిసే వరకు సింగరేణి సంస్థ తరపున ఎలాంటి బిడ్ దాఖలు కాలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను టోకున తమ సన్నిహితులకు అమ్మేస్తోందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణకు అర్హత ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు  వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ దాఖలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో తమ ప్రభుత్వం పాల్గొనబోతున్నట్టు మీడియాకులో పెద్దఎత్తున ప్రచారం చేసుకొంటూ వచ్చారు.

టెండర్ దాఖలుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే సింగరేణి ఉన్నతాధికారులు వైజాగ్ కు వెళ్లి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ లో పాల్గొనడానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టారు.

కానీ చివరి నిమిషం వరకు టెండర్ దాఖలు చేయకుండా సస్పెన్షన్ కు తెరతీశారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో సింగరేణి పాల్గొనాలంటే కేంద్ర  ప్రభుత్వ అనుమతి తప్ప నిసర. ఒకవేళ కేంద్రం అనుమతి ఇవ్వకుండా బిడ్ దాఖలు చేసినా టెక్నికల్ బిడ్ల స్థాయిలోనే తెలంగాణ వేసే టెండర్ తిరస్కరణకు గురవుతుంది.

అదే జరిగితే తెలంగాణకు కనీసం టెండర్ వేయడం కూడా రాదనే అపప్రద ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలోనే తెలంగాణలోని నిజాం షుగర్స్ సహా ఇతర సం స్థలను తిరిగి తెరిపించాలనే డిమాండ్ ప్రజల నుంచి వెళ్లువెత్తే అవకాశముంది. అదే జరిగితే ఎన్నికలకు ముందు కొత్త సమస్యలు కోరితెచ్చుకున్నట్టు అవుతోంది.

ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ ఈపీఐకి అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు బిడ్లు వేశాయి. ఏపీ ప్రజల తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం టెండర్ వేశారు.  కేంద్రాన్ని ఇరుకున పెట్టే పేరుతో టెండర్ రాజకీయాలకు పాలపడితే స్వరాష్ట్రంలో అది తమకే ఇబ్బందికరంగా మా రుతుందనే చివరి నిమిషం బిడ్ దాఖలుకు ప్రభుత్వ పెద్దలు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.