ప్రపంచంపై యుద్ధం కాదు.. బుద్ధుడిని అందించిన భారత్

ప్రపంచానికి భారతదేశం యుద్ధాన్ని అందించలేదని, బుద్ధుడిని అదించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  గౌతమ బుద్ధుని గొప్ప బోధనలు శతాబ్దాలుగా లెక్కలేనన్ని మంది ప్రజలను ప్రభావితం చేశాయని చెబుతూ  బుద్ధుడు చూపిన మార్గాన్ని భారత్ అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
 
దేశ రాజధానిలో నిర్వహిస్తున్న ప్రపంచ బౌద్ధ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం నేడు యుద్ధం, అశాంతితో బాధపడుతోందని గుర్తు చేశారు.  అయితే శతాబ్దాల క్రితం బుద్ధుడు దీనికి పరిష్కారం చెప్పాడని పేర్కొన్నారు.  బుద్ధుని మార్గమే భవిష్యత్తు, స్థిరత్వానికి మార్గమని ప్రధాని వెల్లడించారు.
 
బుద్ధ బోధనల నుండి ప్రేరణ పొందిన భారతదేశం ప్రపంచ సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలను తీసుకుంటోందని చెప్పారు.  ప్రజలు, దేశాలు తమ ప్రయోజనాలతో పాటు ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు.  పేదలు, వనరులు లేని దేశాల గురించి ప్రపంచం ఆలోచించాల్సి ఉంటుందని చెప్పారు.
 
యుద్ధం, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత తీవ్రవాదం, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ సమస్యలకు బుద్ధుడి ఆలోచనలు, బోధనలు పరిష్కారం చూపుతాయని ప్రధాని తెలిపారు.  బుద్ధుని భావాలను ప్రచారం చేయడానికి, గుజరాత్ లోని తన జన్మస్థలం, తన లోక్ సభ నియోజకవర్గం వారణాసితో బౌద్ధమతానికి ఉన్న లోతైన సంబంధాలను చాటి చెప్పేందుకు తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
 
అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందనలు: ఫిలాసఫీ టు ప్రాక్సిస్’ అనే ఇతివృత్తంతో రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తున్నది. ప్ర‌జ‌లు, దేశాలు త‌మ ప్ర‌యోజ‌నాలతో పాటు ప్ర‌పంచ ప్ర‌యోజ‌నాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందని ప్రధాని సూచించారు.
 
గత శతాబ్దంలో ఈ దేశాలు ఇతరుల గురించి, రాబోయే తరాల గురించి ఆలోచించకపోవడం వల్లనే ప్రపంచ దేశాలు ఇప్పుడు వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. దశాబ్ద్దాల పాటు ఆ దేశాలు ప్రకృతి తమపై ప్రభావం చూపించకుండా ఉండాలనే దాని గురించే ఆలోచించాయి. వాళ్లు దాన్ని ఇతరులపై పడేయడం చేస్తూ వచ్చారని పేర్కొన్నారు.
 
భూకంపం వచ్చిన తర్వాత తుర్కియేతో పాటు ఇతరులకు భారత్ సహాయం అందించిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రతి మనిషి బాధను తమదిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కిరెన్ రిజిజులు కూడా పాల్గొన్నారు. ప్రసంగానికి ముందు ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించడంతో పాటుగా బుద్ధుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు.19 మంది ప్రముఖ బౌద్ధ సన్యాసులకు సన్యాసి వస్త్రాలను కూడా ఆయన అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా టిబెటన్ బౌద్ధమతంపై ప్రముఖ అమెరికన్ నిపుణుడు ప్రొఫెసర్ రాబర్ట్ థర్మన్, వియత్నాం బౌద్ధ సంఘం డిప్యూటీ ప్యాట్రియార్క్ థిచ్ ట్రి క్వాంగ్ పాల్గొంటున్నారు. భారతదేశ పురాతన బౌద్ధ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేసిన కృషికి ప్రొఫెసర్ థర్మన్ కు 2020 లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందించింది.
 
బౌద్ధ, సార్వత్రిక ఆందోళనల విషయాలపై ప్రపంచ బౌద్ధ ధర్మ నాయకత్వాన్ని, పండితులను నిమగ్నం చేయడానికి, వాటిని సమిష్టిగా పరిష్కరించడానికి విధాన సూచనలను తీసుకురావడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ప్రయత్నం చేయనుంది. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ బౌద్ధ సన్యాసులు, పండితులు, ప్రతినిధులు హాజరయ్యారు.