9 గంటలపాటు కేజ్రీవాల్‍ను విచారించిన సీబీఐ

ఆమ్ఆద్మీ పార్టీ  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  తొమ్మిది గంటల పాటు విచారించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనను ఆదివారం సుదీర్ఘంగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు.
 
సుమారు 9 గంటల విచారణ తర్వాత ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి కేజ్రీవాల్ ఆదివారం రాత్రి బయటికి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నించారు. మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో అక్రమాలు,.. కమీషన్ రేట్లను పెంచడం అంశాలపై ప్రశ్నించారు.
 
ఈ కేసులో సీబీఐ తనను 56 ప్రశ్నలు అడిగినట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. వారి ప్రశ్నలకు గౌరవంగానే సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అసలు లిక్కర్ స్కాం కేసు అనేది బూటకమని..ఇదంతా కల్పితమే అని కేజ్రీవాల్ విమర్శించారు. లిక్క్ పాలసీ అమలులోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి తనను సీబీఐ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు కేజ్రీవాల్ తెలిపారు.
 
సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో సంబంధాలపై సీబీఐ ప్రశ్నలు సంధించింది. సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం, సౌత్ గ్రూప్తో సంబంధాలపై సీబీఐ ప్రశ్నించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ను ప్రశ్నించారు.
 
లిక్కర్ పాలసీ కేసులో సాక్షిగా విచారణకు రావాలని కేజ్రీవాల్‍కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆదివారం ఆయన సిబిఐ ముందు హాజరయ్యారు. కాగా, సీఎం, పార్టీ చీఫ్ కేజ్రీవాల్‍ను సీబీఐ సుదీర్ఘంగా విచారిస్తున్న తరుణంలో ఆప్ ముఖ్యనేతలు ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్‍ను విచారిస్తున్న సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆమ్ఆద్మీ నేతలు రాఘవ్ చడ్డా, సంజయ్ సింగ్, జాస్మిన్ షాతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో రాఘవ్‍తో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

“కేజ్రీవాల్ ఫోబియాతో బీజేపీ వణికిపోతోంది. కేజ్రీవాల్‍పై ఉన్న భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. మేం జైలుకు భయపడం” అని రాఘవ్ చద్దా విమర్శించారు.  సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద 1,000 మందికి పైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఆ ప్రాంతమంతా 144 సెక్షన్ విధించారు అధికారులు. నలుగురి కంటే ఎక్కువ మంది ఆ ప్రాంతంలో గుమికూడదని ఆంక్షలు విధించారు.

అయితే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేస్తూ తనను అరెస్టు చేయాలని బీజేపీ ఆదేశించవచ్చని ఆరోపించారు. కానీ, సీబీఐ మాత్రం కేజ్రీవాల్‌ను సాక్షిగానే విచారించినట్టు తెలుస్తోంది.

 సీఎం అరవింద్ కేజ్రీవాల్‍ను సీబీఐ సుదీర్ఘంగా విచారిస్తున్నసమయంలో ఆదివారం సాయంత్రం ఆమ్ఆద్మీ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా, ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఇక్బాల్‍ ఈ సమావేశంలో ఉన్నారు. అలాగే పార్టీ ఆఫీస్ బేరర్లు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరిలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ ముఖ్యనేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు. బెయిల్‍కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఇదే కేసుకు సంబంధం ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలతో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‍ను 2022లో ఈడీ అరెస్ట్ చేసింది.