జర్నలిస్టుల భద్రతపై కేంద్ర హోంశాఖ అప్రమత్తం

గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాది పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ దారుణ హత్య అనంతరం కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు భద్రత కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. జర్నలిస్టులమని చెప్పుకొన్న ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిద్దరిపై కాల్పులు జరిపడమే దీనికి ప్రధాన కారణం.
 
ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిద్దరినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు

 
అతిక్-అష్రాఫ్ అహ్మద్‌లను కాల్చిచంపిన లవ్‌లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య.. తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రెస్ కార్డులను మెడలో ధరించ, వారు సంఘటన స్థలానికి చేరకున్నారు. వారు వినియోగించిన బైక్‌పై కూడా ప్రెస్ అని రాసి ఉన్నట్లు చెబుతున్నారు. ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా చెప్పుకొని ఈ ఘాతుకానికి పాల్పడటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.
 
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను రూపొందించనుంది. ఈ దిశగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు హోం మంత్రిత్వ శాఖ ఈ ఎస్ఓపీలపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను అమిత్ షా కార్యాలయానికి పంపించనుంది.
 
ఈ మార్గదర్శకాలతో కూడిన ప్రతిపాదనలపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే అవి అమలులోకి వస్తాయని హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కూడా తగిన భద్రతను కల్పించే దిశగా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్ ఉంటాయని తెలుస్తోంది.