సుఖేశ్ ఎవ్వరో తెలియదన్న కవిత… కొట్టిపారేసిన లాయర్!

మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్‌‌ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా బుధవారం తనతో వాటప్ లో చాట్ చేసినట్లు విడుదల చేసిన స్క్రీన్ షాట్ లపై బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. సుఖేశ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని,  కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అయితే ఆమె ప్రకటనను సుఖేష్ చంద్రశేఖర్ లాయర్ అనంత్ మాలిక్ కొట్టిపారవేసారు. కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉందని ఎద్దేవా చేశారు. సుఖేష్ తన వాదనలకు మద్దతుగా అనేక డిజిటల్ సాక్ష్యాలను అందజేశారని తెలిపారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు కవిత దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు.
 
కాగా, బీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశ్యపూర్వకంగా ఫేక్ చాట్‌వతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సీఎం కెసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక తనపై ఈ విధంగా దాడి చేస్తున్నారని కవిత మండిపడ్డారు. అసలు సుఖేశ్ ఎవరో తనకు తెలియదని, అతనితో పరిచయం కూడా లేదని కవిత స్పష్టం చేశారు. ఇవేవి పట్టించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో పనిగట్టుకుని  తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
 
ఇదివరకు తన  మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తర్వాత తోక ముడిచారని కవిత పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్  కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆమె చెప్పారు.
 
“కవిత సమాధానం ఏజెన్సీల నుంచి దాగుడుమూతలాట ఆడినట్లు ఉంది. కవిత ఇచ్చిన సమాధానంలో తన వాక్పటిమ చూపారు. మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్‌లాగా కవిత స్పందన ఉంది. ప్రస్తుత విషయం ప్రత్యేక ఏజెన్సీల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినది. సాధారణ ప్రజలలో ప్రజాదరణ పోటీకి సంబంధించిన విషయం కాదు. ఈ వారంలోనే నా క్లయింట్ ద్వారా దీనిపై వివరణాత్మక ప్రతిస్పందన అందించబడుతుంది.” అని కవితకు అనంత్ మాలిక్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు.
ఇలా ఉండగా, ‘‘అమ్మ కవితమ్మ.. అత్త మీది కోపం దుత్త మీద చూపినట్టు ఉంది నీ వ్యవహారం. నీ బండారం బట్టబయలైతే, అవి మీడియా టెలికాస్ట్ చేస్తే.. జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు విలువ ల్లేవని అంటావా? నీకు ఏం విలువ ఉన్నట్లు? బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసినవ్. తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసినవ్.. బురదచల్లడం అంటే ఏంటో జర చెప్పమ్మా.. లిక్కర్ స్కామ్​లో రోజుకో ఎపిసోడ్ బయటపడుతున్నది. నిజాలు రాయకుండా.. లిక్కర్ స్కామ్​తో ఘనకార్యం చేసినవ్​ అని నెత్తినపెట్టుకోవాలా..?”అని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల కవితను ప్రశ్నించారు.