యువశక్తి కోసం విభిన్న అవకాశాలను సృష్టిస్తున్నాం

మౌలిక రంగంలో ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రీయ రోజ్‌గార్ మేళాలో 71 వేల మందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా ఉద్యోగాల్లో చేరేవారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
 
రాష్ట్రీయ రోజ్ గార్ మేళా యువతకు ఉద్యోగాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మోదీ అన్నారు. రక్షణ శాఖకు కావాల్సిన 300 పరికరాలను మన దేశం ఉత్పత్తి చేస్తుందని ప్రధాని చెప్పారు.  రోజ్‌గార్ మేళా డ్రైవ్‌లో భాగంగా 2024లో వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
 

‘ఈ 8 ఏళ్లలో కొత్తగా ఏర్పాటైన స్టార్టప్‌లు 40 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయి. ఇది భారతదేశపు గొప్ప స్టార్టప్ స్ఫూర్తిని సూచిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మూలధన పెట్టుబడి ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. యువశక్తి కోసం విభిన్న అవకాశాలను సృష్టిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు.

‘‘కొత్త అవకాశాలకు తలుపులను తెరచినటువంటి విధానాలతో, వ్యూహాలతో నేటి ‘న్యూ ఇండియా’ ముందుకు సాగిపోతోంది’’, అని ఆయన భరోసా ఇచ్చారు. ‘దశాబ్దాలుగా మన పిల్లలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొమ్మలతో ఆడుకునే వారు. ఇపుడు స్వదేశీ బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించడంతో.. దేశంలోనే ఇదొక పెద్ద పరిశ్రమగా అవతరించి వేలాది మందికి ఉపాధిని కలిపిస్తోంది’ అని ప్రధాని చెప్పారు.

‘2014 వరకు భారతదేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే.. ఇప్పుడు 148 విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాల పెరుగుదల కారణంగా  కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గత 8-9 సంవత్సరాల్లో మూలధన వ్యయం 4 రెట్లు పెరిగింది. దీని వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయి. మన పౌరుల ఆదాయం కూడా పెరిగింది’ అని మోదీ వివరించారు.

ఆత్మనిర్భర్ స్కీంతో దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలను సృష్టిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు కొత్త ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆత్మనిర్భర్ స్కీం దారితీస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 70,000 మందికి పైగా యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ప్రధాని వెల్లడించారు. ఎన్డీయే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని చెప్పారాయన. నిన్న మధ్యప్రదేశ్ లో 22,000 మంది ఉపాధ్యాయులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చారని ప్రధాని వివరించారు.
ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్కు, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుళ్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, పోస్టల్ అసిస్టెంట్లు, ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, లైబ్రేరియన్ లు, నర్సుల ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను ప్రదానం చేశారు.