పరువు నష్టం కేసులో రాహుల్ కు పాట్నా కోర్టు సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. మోదీ  ఇంటి పేరును ఉద్దేశించి చేసి ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ దాఖలైన పరువునష్టం కేసులో తాజాగా బిహార్ లోని పాట్నా కోర్టు సమన్లు పంపింది. ఏప్రిల్ 25న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పాట్నాలోని  కోర్టులో పరువు నష్టం దావా వేశారు. 

ఏప్రిల్ 12న గాంధీని కోర్టు ఎదుట హాజరు కావాలని ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరైన రాహుల్ తరఫు న్యాయవాదులు ప్రస్తుతం రాహుల్ గాంధీ సూరత్ కోర్టు కేసులో బిజీగా ఉన్నారని తెలిపారు. ఈ కారణంగా కేసును మరో తేదీన విచారించాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన జడ్జి  కేసును ఏప్రిల్ 25కు వాయిదా వేశారు. 

‘‘నిజానికి ఈ రోజే రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. సీఆర్పీసీ సెక్షన్ 317 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. కానీ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. కనుక రాహుల్ గాంధీకి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని అభ్యర్థిస్తున్నాను’’ అని సుశీల్ కుమార్ మోదీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
 
కానీ, ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే, వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 25న వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్రాసిక్యూషన్ లాయర్ ప్రియా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదుదారు తరపు వాంగ్మూలాలు నమోదు చేశామని, అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామని, ఇప్పుడు రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని మాత్రమే నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఆ తరువాత ఆయనపై  లోక్‌సభ నుండి ఎంపీగా అనర్హత వేటు పడింది.