15 రోజుల పాటు దేశంలో భారీగా కరోనా కేసులు

వచ్చే రెండు వారాల్లో అంటే, ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  బుధవారం దేశంలో కరోనా కేసులపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మేరకు అంచనాకు వచ్చారు అధికారులు. మంగళవారం ఒక్క రోజే అత్యధికంగా 7 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.

అయితే, కొత్త వేరియంట్ XBB.1.16  కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా ఎండమిక్ దశలో ప్రవేశిస్తుందని, వచ్చే రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని తెలిపింది. ఆ తరువాత కేసులు తగ్గుతాయని అంచనా వేసింది.

నిత్యం కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేశాల్లో భారత్‌ మూడోస్థానానికి చేరింది. వైరస్‌ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తుండడం ఫోర్త్‌ వేవ్‌కు సంకేతమా? మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడు రోజుల్లోనే దేశంలోనే 42వేల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు.
 
ఇప్పటి వరకు 97 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 40,215 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.  మహమ్మారి నుంచి ఇప్పటి వరకు కొవిడ్‌తో 5.31లక్షల మంది దుర్మరణం చెందగా, మొత్తం కేసుల సంఖ్య 4.47కోట్ల మంది వైరస్‌ బారినపడ్డారు. ఇప్పటి వరకు దేశంలో 220.66కోట్ల డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.

చాలాదేశాల్లో ఇప్పటికీ మహమ్మారి కొనసాగుతూనే ఉన్నది. ప్రతి రోజూ దక్షిణ కొరియాలో 12వేలు, జపాన్‌లో 9వేలు, భారత్‌లో 5నుంచి7వేల కేసులు నమోదవుతున్నాయి. రష్యా, బ్రెజిల్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ మొదలైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 ప్రస్తుతం దేశంలో కొత్త వేవ్‌ వచ్చే అవకాశం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) గోరఖ్‌పూర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం డైరెక్టర్ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. దేశంలో చాలా మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని, అందుకే భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

అయితే, ప్రమాదం లేదని నిర్లక్ష్యం పనికిరాదని, తమను తాము కాపాడుకోవాలని, నివారణకు ప్రోటోకాల్స్‌ను పాటించాలని ఆయన సూచించారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించే ప్రశ్నే  లేదని రజనీకాంత్‌ తేల్చి చెప్పారు. కరోనా వైరస్‌ దేశంలో అంతానికి దగ్గరలో ఉందని, జలుబు, ఫ్లూ మాదిరిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరో పది రోజులు కేసులు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేసులు పెరుగుతున్నా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు. ఈ వేరియంట్‌ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అని నిపుణులు వివరించారు. కరోనా కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, అయితే, మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీప్రాంతాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే, మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి వేవ్‌ నుంచి కూడా మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా తాజాగా రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యికి చేరువయ్యాయి.