పాక్ లో కంటే భారత్‌లోనే మెరుగుగా ముస్లిం ప్రజలు

ఇస్లామిక్‌ దేశమైన పాకిస్థాన్‌ కంటే భారత్‌లోనే ముస్లిం ప్రజల జీవనం మెరుగ్గా ఉందని, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో పీటర్సన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్స్‌లో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
 
భారత్‌లోని ముస్లిం మైనార్టీలు హింసకు గురువుతున్నారంటూ పశ్చిమ దేశాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న రెండో దేశం భారత్‌ అని ఆమె గుర్తుచేశారు.
 
భారత్‌లో ముస్లిం మైనార్టీలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వంటి అంశాలపై సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ‘‘ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్‌.. వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారి జీవితాలు కష్టంగా ఉంటే, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దేశ విభజన జరిగిన 1947 కంటే వారి జనాభా ఈ స్థాయిలో పెరుగుతుందా?” అని ఆమె ప్రశ్నించారు.
 
 అప్పుడు ఇస్లామిక్‌ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి దయనీయంగా మారిందని,  అక్కడ వారి సంఖ్య నానాటికీ కుచించకుపోతోందని ఆమె గుర్తు చేశారు.  చిన్న చిన్న ఆరోపణలకే వారికి మరణ దండన వంటి కఠిన శిక్షలు విధిస్తున్నారని, చాలా కేసుల్లో వ్యక్తిగత కక్షలను తీర్చుకోడానికి దైవదూషణ చట్టాలను వినియోగిస్తున్నారని ఆమె తెలిపారు.
 
సరైన విచారణ, న్యాయస్థానాలతో పని లేకుండా బాధితులను తక్షణమే దోషులుగా నిర్దారించి శిక్షిస్తున్నారని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. పాక్‌లో మైనార్టీలు తగ్గిపోతున్నారని, కొన్ని ముస్లిం వర్గాలను కూడా నిర్మూలిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, భారత దేశంలో అటువంటి పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు.
 
“మా దగ్గర శాంతి భద్రతలు దేశం మొత్తానికి సంబంధించిన అంశం. భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం తెలుసుకోకుండా నిందించడం సరికాదు’’ అని ఆమె మండిపడ్డారు.
 
పాకిస్థాన్ లో ముహాజిర్లు, షియా, ప్రధాన స్రవంతి ఆమోదించని ఇతర సమూహంపై హింస ప్రబలంగా ఉందని అంటూ తనకు బహుశా సున్నీల గురించి తెలియదని ఆమె చెప్పారు. “భారతదేశంలో ముస్లింలు తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా ఫెలోషిప్‌లు అందజేస్తున్నారు” అని నిర్మల సీతారామన్ వివరించారు.
 
ఇలాంటి కథనాలు ప్రచురించేవారు భారత్‌కు వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె హితవు చెప్పారు. దేశవ్యాప్తంగా ఒంటరిగా పయనించి తమ ఆరోపణలను రుజువు చేయాలని ఆమె సూచించారు. భారత దేశం పట్ల ప్తికూలమైన వార్తలు మాత్రమే ఇస్తూ భారత్ పట్ల వ్యాపారవర్గంలో భయం, ఆందోళనలు కలిగించడం పాశ్చాత్య మీడియాకు పరిపాటిగా మారిందని ఆమె దుయ్యబట్టారు.
భారత దేశానికి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చెబుతూ అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకొనేవారు భారత దేశం ఎప్పుడు సందర్శించకుండా తమకున్న అపోహలను వ్యాప్తిచేస్తున్న కథనాలతో ప్రభావితం కాకుండా, స్వయంగా భారత్ కు వచ్చి, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ఆర్థిక మంత్రి ఆహ్వానం పలికారు.