హైదరాబాద్ నుండి బెంగుళూరుకు మరో వందే భారత్ రైలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లలో రెండు ఇప్పటికే తెలుగు రాస్త్రాలలో నడుస్తున్నాయి. మొదటిది సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్య నడుస్తుండగా, తాజాగా సికింద్రాబాద్ నుండి తిరుపతికి మరో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక, సికింద్రాబాద్ నుండి బెంగుళూరుకు మరో రైలు కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తున్నది.

ఈనెల 8న తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఈ విషయంపై స్థానిక బీజేపీ నేతలతో చర్చించినట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ నడపాలనని గంతలోనే రైల్వే శాఖ నిర్ణయించినా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తిరుపతికి ఎక్కువ మంది భక్తులు వెళతారని అందుకు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుపట్టడంతో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య పట్టాలెక్కించారు.


కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, గతంలోనే ఈ లైన్‌పై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సికింద్రాబాద్ – బెంగళూరు వందే భారత్ రైలుపై బీజేపీ నేతలతో చర్చించినట్లు తెలిసింది. అయితే ఈ రైలును ఏ తేదీన ప్రారంభిస్తారనే అంశంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఈ కొత్త రైలుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరుకు పలు రైళ్లు నడుస్తున్నాయి. రెండు నగరాల మధ్య 570 కి.మీల దూరం ఉండగా, 11 గంటల ప్రయాణ సమయం ఉంది. అదే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం 7 గంటల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు.  సికింద్రాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవటానికి ప్రస్తుతం రెండు రైల్వే మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
వికారాబాదాద్ – తాండూరు – రాయచూరు – గుంతకల్లు మార్గం ఒకటి. మహబుబూనగర్ – కర్నూలు – గంతుకల్లు మీదుగా రెండో మార్గం అందుబాటులో ఉంది. వీటిలో రెండో మార్గం వైపు రైల్వే శాఖ మెుగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తుంది.