పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీనగర్‌లో జీ20 సదస్సు

ఈ ఏడాది జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న భారత్ జీ20 సమావేశాల నేపథ్యంలో పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలకు వరుసగా షాక్ లు ఇస్తున్నది. ఇప్పటికే చైనాకు తన ఉద్దేశం అర్థమయ్యేలా చేసేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో జీ20 రహస్య సమావేశం ఏర్పాటు చేసిన భారత్, ఈసారి పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీనగర్‌లో జీ20 సదస్సును నిర్వహిస్తోంది.
 
పర్యాటక రంగంపై మే 22-24 తేదీల మధ్య శ్రీనగర్‌లో జీ20 దేశాల సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ సమావేశాన్ని భారత్ శ్రీనగర్‌‌లో నిర్వహించకుండా చూసేందుకు పాకిస్థాన్ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది.  సౌదీ అరేబియా, టర్కీ, చైనా తదితర దేశాలతో లాబీయింగ్ చేసింది. అయినప్పటికీ భారత్ మాత్రం శ్రీనగర్‌నే వేదికగా నిర్ణయించింది.
గత నెలలో అరుణాల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో జీ20 రహస్య సమావేశాన్ని భారత్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి చైనా డుమ్మా కొట్టింది.
అరుణాచల్ ప్రదేశ్‌ను తన భూభాగంగా చెప్పుకుంటున్న చైనా ఆ రాష్ట్రంలోని 11 ప్రదేశాలకు కొత్త పేర్లను పెట్టింది. దీనికి ఘాటుగా స్పందించిన భారత పేర్లను మార్చి చరిత్రను మార్చలేరంటూ డ్రాగన్‌కు చురకలు అంటించింది. అయితే అక్కడ జరిపిన జి20 సమావేశం గురించి నోరు మెదపలేదు.
 
అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన జీ20 సదస్సుకు డుమ్మా కొట్టినట్టుగానే శ్రీనగర్ మీటింగ్‌కు సైతం చైనా దూరంగా ఉండే అవకాశం ఉంది. ‘శ్రీనగర్ సమావేశం విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. దీని కోసం గత ఏడాది నుంచే సన్నాహాలు మొదలుపెట్టాం. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రెండూ భారత్‌లో అంతర్భాగమే’ అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన జీ20 సమావేశంలో 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీనగర్ సదస్సుకు కూడా ఇదే తరహా స్పందనను భారత్ కోరుకుంటోంది. కశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న పాకిస్థాన్ నోరు మూయించడానికి భారత్ ఈ సమావేశాన్ని ఉపయోగించుకోనుంది.

 
కశ్మీర్లో ప్రజా జీవితం సాధారణంగా ఉందని ప్రపంచానికి చెప్పడానికి భారత్ ఈ సమావేశాన్ని ఓ అవకాశంగా ఉపయోగించుకోనుంది.  షాంఘై సహకార సంస్థ సమావేశాల కోసం త్వరలోనే చైనా రక్షణ, విదేశాంగ మంత్రులు భారత్‌ రానున్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశాలను జులైలో నిర్వహించనున్నారు. ఈ భేటీ తేదీల ఖరారు కోసం చైనా, రష్యా తదితర సభ్య దేశాలతో భారత్ టచ్‌లో ఉంది. ఈ సమావేశానికి చైనా అధినేత జిన్‌పింగ్ కూడా వస్తే 2020 ఏప్రిల్‌లో లడఖ్ ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల అధినేతల ద్వైపాక్షిక భేటీ ఇదే తొలిసారి కానుంది.
 

ఉత్తరాన కాశ్మీర్ నుండి దక్షిణాదిన కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా 28 రాస్త్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో 56 జి20 సమావేశాలను భారత్ జరుపుతున్నట్లు గత నెల ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిత కాంబోజ స్పష్టం చేశారు. జి20 అధ్యక్ష హోదాలో అమెరికా, చైనా, ఇండోనేసియాలు కేవలం 12, 14, 25 నగరాలలోని ఈ సమావేశాలను నిర్వహించాయి.