కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం సంజయ్ అరెస్ట్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గమని మండిపడుతూ కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం ఈ కేసులో  ఏ1 గా పెట్టారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు.  కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని,   కేసులకు, జైళ్లకు బీజేపీ నాయకులు భయపడబోరని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ కొత్త జైలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ ని అర్ధరాత్రి  అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని, టాబ్లెట్ లు కూడా వేసుకోనివ్వలేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అంటూ అరెస్ట్ సందర్భంలో పోలీసుల తీరు దారుణమని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.  ఉగ్రవాదులతో కంటే హీనంగా పోలీసులు వ్యవహరించారని, సంజయ్‌ను అనేక ప్రాంతాల్లోకి, అనేక పీఎస్‌లకు తిప్పారని,విమర్శించారు. 

కేసీఆర్ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో  కేసీఆర్ అరాచక పాలన కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.  ప్రభుత్వం చేతకానితనంతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంజయ్‌ అరెస్ట్‌పై న్యాయ, రాజకీయ పోరాటాలు చేస్తామన్ని స్పష్టం చేశారు. కల్వకుంట కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. అక్రమ అరెస్ట్‌లు, నియంతృత్వ చర్యలు బీజేపీ గొంతు నొక్కలేవని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నేతలతోనూ పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్ ఫోటోలు దిగాడని, అంత మాత్రానా వాళ్లతో సంబంధం ఉన్నట్టా? అని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే బండి సంజయ్ ను  అరెస్ట్ చేశారంటూ ఆయన దుయ్యబట్టారు. రాజకీయ నాయకులకు జర్నలిస్ట్ లు సమాచారం ఇవ్వడం తప్పా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రతిపక్షంగా తాము పోరాటం చేస్తున్నామని చెబుతూ అధికారులు, రిపోర్టర్ లు, ఐఏఎస్ లు తమకు సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పేలా అవుతుందని ఆయన నిలదీశారు.  బండి సంజయ్ కి పేపర్ రావడం కంటే ముందే పేపర్ లలో, టీవీలలో, సోషల్ మీడియాలో వచ్చిందని గుర్తు చేశారు.

ప్రగతి భవన్ రాసిచ్చిన స్క్రిప్ట్ ను  పోలీసులు బాగా అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆందోళనలు జరుగుతున్నాయని, విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

డైవర్షన్ రాజకీయాలు కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ కేసీఆర్ బీఆర్‌ఎస్‌ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదని చెప్పారు. బండి సంజయ్‌ను ప్రభుత్వం టార్గెట్ చేసిందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి, కొడుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్లు దేశం మొత్తం దోచుకోవాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. దొంగ కేసులు, ఎమ్మెల్యేల నిర్బంధం కేసీఆర్‌కే చెల్లుద్దని ఎద్దేవా చేశారు.