రూ.11,300 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం

ఈ నెల 8న తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన దాదాపు 2 గంటల పాటు కొనసాగనుంది. రూ.11,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మోదీ తెలంగాణ పర్యటనపై అధికారిక షెడ్యూల్​ను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) బుధవారం విడుదల చేసింది.

ఈ నెల 8, 9 తేదీల్లో ప్రధాని మోదీ  తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా  పర్యటిస్తారని వెల్లడించింది. 8న ఉదయం 11:45 నిమిషాలకు ప్రధాని  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు చేరుకుని సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా భువనగిరి బీబీనగర్ లో నిర్మిస్తున్న ఎయిమ్స్ కు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే ఐదు నేషనల్ హైవే ప్రాజెక్టులు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్ కు శంకుస్థాపన చేస్తారు.

జంట నగరాల్లోని సబర్బన్ ఏరియాల్లో 13 కొత్త ఎంఎంటీఎస్ సేవలను ప్రారంభిస్తారు. అలాగే సికింద్రాబాద్‌‌-మహబూబ్‌‌నగర్‌‌ ప్రాజెక్టు డబ్లింగ్‌‌, ఎలక్ట్రిఫికేషన్​ పనులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. దాదాపు 85 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టును రూ.1,410 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. రూ.7,850 కోట్లతో నిర్మిస్తున్న జాతీయ ర‌‌హ‌‌దారుల ప్రాజెక్టుల‌‌కు ప్రధాని శంకుస్థాప‌‌న చేస్తారు. అనంతరం అనంతరం 1.30గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుని మోదీ తమిళనాడుకు ప్రయాణం కానున్నారు.