9 బిలియ‌న్ల డాల‌ర్ల రాజీకి జాన్స‌న్ కంపెనీ సంసిద్ధత

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీపై అమెరికాలో వేల కేసులు ఉన్న విష‌యం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్‌(తో పాటు ఇత‌ర ఉత్ప‌త్తుల్ని వాడ‌డం వ‌ల్ల క్యాన్సర్ వ‌చ్చిన‌ట్లు వేలాది మంది కేసులు దాఖ‌లు చేశారు. అయితే ఆ కేసుల్లో సెటిల్మెంట్  కోరుతున్న జాన్స‌న్ కంపెనీ తాజాగా ఓ ప్ర‌తిపాద‌న చేసింది.

దివాళా కోర్టును ఆశ్ర‌యించిన ఆ కంపెనీ మొత్తం కేసుల ప‌రిష్కారం కోసం 9 బిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించ‌నున్న‌ట్లు త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన్న‌ది. ఒక్క అమెరికాలోనే సుమారు 40 వేల కేసులు జాన్స‌న్ కంపెనీపై ఉన్న‌ట్లు తెలుస్తోంది.  త‌మ కంపెనీపై వేసిన కేసుల్ని విలువైన‌వే అని గుర్తిస్తున్న‌ట్లు చెప్పిన ఆ కంపెనీ న్యాయ‌పోరాటంలో భాగంగా సెటిల్మెంట్‌ను పెంచిన‌ట్లు అంగీక‌రించింది.

గ‌తంలో రెండు బిలియ‌న్ల డాల‌ర్లు ఇస్తాన‌ని చెప్పిన ఆ కంపెనీ ఇప్పుడు త‌న సెటిల్మెంట్‌ను 9 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు పెంచ‌డం గ‌మ‌నార్హం. జాన్స‌న్ కంపెనీపై కేసు వేసిన 40 వేల మంది.. ఆ కంపెనీ ఉత్ప‌త్తుల్లో క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మైన అస్‌బెస్టాస్ ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు చేశారు.

2020 నుంచే అమెరికాలో ఆ కంపెనీకి చెందిన టాల్క‌మ్ పౌడ‌ర్ అమ్మ‌కాల‌ను ఆపేశారు. ఇక గ‌త ఏడాది నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా తమ ఉత్ప‌త్తుల అమ్మ‌కాన్ని ఆ కంపెనీ నిలిపివేసింది. బాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ దాదాపు 130 ఏళ్ల నుంచి త‌మ ఉత్ప‌త్తుల్ని సేల్ చేస్తోంది.