దాదాపు రెండింతలుగా పెరిగిన బెంగుళూరులో అద్దెలు

`సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇంటి అద్దెలు దేశంలోనే అత్యధికంగా ఉంటున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇళ్ల అద్దెలు 2022 ఆరంభంతో పోలిస్తే దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్‌ మార్కెట్‌గా మారింది. ఈ మధ్య బెంగళూరులో ఇండ్ల అద్దెలు సామాన్యుడి భరించలేనంతగా అమాంతం పెరిగిపోయాయి. 

డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె రూ.50 వేల వరకు పెరిగింది.  ఆర్థిక రాజదాని ముంబయి, ఇతర మెట్రో నగరాలు చెన్నై, హైదరాబాద్ కంటే ఇక్కడ అద్దెలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇళ్ల యజమానులు ఇప్పుడు తమ ఆదాయంలో ఎక్కువ సంపాదన ఇంటి అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్‌ రీసెర్చ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గూగుల్‌, అమెజాన్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, యాక్సెంచర్‌.. వంటి పెద్ద సంస్థలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని వివిధ సర్వేల అంచనా. కరోనా సమయంలో వీరందరికీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ సదుపాయం కల్పించడంతో సొంతూళ్లకు చాలామంది వెళ్లారు. దీంతో ఇళ్ల అద్దెలు చాలా వరకూ తగ్గిపోయాయి. అయితే కరోనా వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

చాలామంది ఉద్యోగులు కంపెనీలకు వెళ్లి పని చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచి చేసే పనికి పుల్ స్టాప్ పెట్టారు. దీంతో చాలామంది ఉద్యోగులు మళ్లీ బెంగళూరు బాట పట్టడంతో మళ్లీ ఇంటి అద్దెలు పెరిగిపోతున్నాయి. ఇంటి అద్దెలు పెంచడం వల్ల కరోనా  సమయంలో వాటిల్లిన నష్టాల్ని యజమానులు ఇప్పుడు పూడ్చుకుంటున్నారని తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగళూరులో ‘రెంటల్‌ మార్కెట్‌’కు మంచి డిమాండ్‌ ఉందని చెబుతున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని చాలామంది ఉద్యోగులు వాపోతున్నారు. మరోవంక,  ఇంటి ఓనర్లు కొత్త కొత్త రూల్స్ కూడా తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

రాత్రి పూట గెస్ట్‌లకు అనుమతి ఇవ్వట్లేదట. ఇంటి అద్దె కోసం వచ్చే వారిని పలు రౌండ్లు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారట. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ ఇవ్వడం తప్పనిసరని చెబుతున్నారు. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? ఏ కంపెనీలో చేస్తున్నారు? జీతం ఎంత? వంటి విషయాలను అడుగుతున్నారట. అన్ని వివరాలు ఇచ్చిన తర్వాతే ఇళ్ళను అద్దెకు ఇస్తున్నారు. కొంతమంది ఇంటి యజమానులైతే ఉద్యోగుల పే స్లిప్స్ కూడా తీసుకుంటున్నారట. అంతా ఓకే అయితేనే ఇల్లు అద్దెకు ఇస్తున్నారట.