651 అత్యవసర మందులపై ఏడు శాతం తగ్గిన ధరలు

అత్యవసరంగా వినియోగించే సుమారు 651 మందుల ధరలు సగటున 6.73 శాతం తగ్గినట్లు నేషనల్ ఫార్మాసిటికట్ ప్రైసింగ్ అథారిటీ పేర్కొంది. ఏప్రిల్ నెల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మందుల ధరలను నియంత్రించే ఎన్‌పీపీఏ సంస్థ తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఈ మందుల ధరలు దాదాపు 7 శాతం తగ్గనున్నాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ నుంచే అమల్లోకి రానున్నాయి.

ఎన్‌ఎల్‌ఈఎం జాబితాలో మొత్తం 870 షెడ్యూల్డ్ మందులు ఉన్నాయని , అయితే ఈ జాబితా లోని 651 మందులకు ప్రభుత్వం సీలింగ్ విధించినట్టు తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో ఎన్‌ఎల్‌ఈఎం ఆరోగ్యమంత్రిత్వశాఖ సవరించిన విషయం తెలిసిందే. తాజాగా విధించిన సీలింగ్‌తో ఆ 651 మందుల ధరలు మొత్తంగా 16.62 శాతం తగ్గినట్టు నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ పేర్కొంది. అయితే ఆ 651 మందులకు ధరలను నిర్ణయించడం వల్ల వాటి ధరలు 12.12 శాతం పెరగకుండా ఏప్రిల్ నుంచి 6.73 శాతం తగ్గినట్టు తెలిపింది.

దీంతో మందుల ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ తగ్గింపుతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని ఎన్పీపీఏ తెలిపింది. జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్, యాంటీ డయాబెటీస్ మందులు మెట్ ఫార్మిన్, గ్లిమెపిరైడ్, టెల్మిసార్టాన్, యాంటీ బయోటిక్ మందైన అమోక్సిలిన్, క్లాపులానిక్ యాసిడ్ వంటి మందుల ధరలు తగ్గాయి.

ఎక్కువ మంది ప్రజలు వినియోగించే అత్యవసర మందులతో కేంద్ర ఆరోగ్యశాఖ ఓ జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో మొత్తం 870 రకాల ఔషధాలున్నాయి. అయితే, ఈ మందుల టోకు ధరల సూచీ ఆధారంగా ఏప్రిల్ 1న ఈ ధరలను సవరిస్తుంటారు.

2022 సంవత్సరానికి గానూ ఈ సూచీ 12.12 శాతం పెరిగింది. దీంతో షెడ్యూల్డ్ మందుల పరిధిలోకి వచ్చే 857 రకాల మందులను 12.12 పెంచుతూ ఎన్పీపీఏ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా, ఈ జాబితాలోని అత్యధికంగా 651 మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.