చమురు ఉత్పత్తిపై కోతలు విధించాలని ఒక వంక అరబ్ దేశాలు, మరోవంక రష్యా కీలక నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్దీ వారాలుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. మే నుంచి చమురు ఉత్పత్తిని తగ్గించాలని అరబ్ దేశాలు నిర్ణయించాయి.
ఈ మేరకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్, అల్జీరియా, ఒమన్ దేశాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. మార్కెట్ స్థిరత్వం లక్ష్యంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని దేశాలు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ నిర్ణయంలో భాగంగా రోజుకు సౌదీ అరేబియా 5,00,000 బారెళ్లు, ఇరాక్ 2,11,000 బారెళ్లు, యూఏఈ 1,44,000 బారెళ్లు, కువైట్ 1,28,000 బారెళ్లు, అల్జీరియా 48,000 బారెళ్లు, ఒమన్ 40,000 బారెళ్ల చమురు ఉత్పత్తిలో కోత విధించనున్నాయి. దీంతో మొత్తంగా ఒక మిలియన్ బారెళ్ల చమురు ఉత్పత్తి తగ్గనుంది. మే నుంచి ఈ ఏడాది చివరకు నాటికి ఈ చమురు ఉత్పత్తి తగ్గింపు చేసే విధంగా నిర్ణయించినట్లు వెల్లడించాయి.
మరోవంక, రష్యా కూడా 5,00,000 బారెళ్ల ఉత్పత్తిని తగ్గించనున్నట్లు పేర్కొంది. గతేడాది అక్టోబరులో నిర్వహించిన సమావేశంలో నవంబరు 1, 2022 నుంచి రోజుకు 2 బిలియన్ బారెళ్ల చమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్+ దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం గతేడాది నిర్ణయించిన ఉత్పత్తికి అదనమని తెలిపాయి. ఈ నిర్ణయం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపితే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
More Stories
భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
కేజ్రీవాల్పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కుంభమేళాతో ఉత్తర ప్రదేశ్ కు రూ.2 లక్షల కోట్లు ఆదాయం