అనుకూల వాతావరణంతో వ్యాపిస్తున్న కరోనా వైరస్

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉందని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ మూడువేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఒక్క దేశరాజధాని ఢిల్లీలోనే ప్రతిరోజూ 400 పైగా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో బిఎల్‌కె హాస్పిటల్‌లో అత్యధికమంది జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో చేరుతున్నారు.  ఈ విషయంపై బిఎల్‌కె సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఛాతీ, శ్వాసకోశ విభాగాల డైరెక్టర్‌ డాక్టర్‌ సందీప్‌ నాయర్‌ మీడియాతో మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ తమ వద్దకు వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని చెప్పారు.

“మేము వెంటనే వారికి కరోనా పరీక్షలు చేస్తున్నాము. కరోనా  సోకిన వారిని వెంటనే తమ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండమని సూచిస్తున్నాము. జలుబు, జ్వరం వంటి లక్షణాలు తీవ్రంగా ఉన్న రోగులను తక్షణమే ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాలని చెబుతున్నాము” అని తెలిపారు. అయితే ప్రస్తుతం చాలామంది హౌస్‌ ఐసోలేషన్‌లో ఉండడం వల్ల కోలుకుంటున్నారని చెప్పారు.

 ఈ సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా వారు వైద్య సంప్రదింపులు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారని వెల్లడించారు. బిఎల్‌కె ఆసుపత్రిలో ప్రస్తుతం కోమోర్బిడ్‌ అనే ఒక్క పేషెంట్‌ మాత్రమే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారని నాయర్‌ పేర్కొన్నారు. ఇక హృదయ, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్‌ బాధపడుతున్న వ్యక్తులు మాత్రమే కరోనాని ఎదుర్కొనేందుకు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుందని నాయర్‌ తెలిపారు.

వైరస్‌ వ్యాప్తి కావడానికి ఈ వాతావరణం అనుకూలంగా ఉందని, వైరస్‌ ఇన్ఫెక్షన్లతోపాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నాయని డాక్టర్‌ నాయర్‌ చెప్పారు. అలాగే గత కొన్నినెలలుగా ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని, వైరస్‌ కేసులు పెరగడానికి ఇదొక ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు.