అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ .. విడుదల

అమెరికా రాజకీయాల్లో మొట్ట మొదటి సారి ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోర్న్‌స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టయ్యారు. ట్రంప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూయార్క్‌ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు.  తన నివాసం నుంచి కార్ల ర్యాలీతో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో లొంగిపోయేందుకు కోర్టు హాలు వద్దకు ట్రంప్‌ చేరుకున్నారు.
వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి అటార్నీ కార్యాలయానికి తరలించారు. ఫింగర్‌ ప్రింట్‌, ఫొటోలను తీసుకున్న అనంతరం కోర్టు హాలుకు తరలించారు.  సాధారణంగా ఇలాంటి విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్‌ విషయంలో మినహాయింపులు ఇచ్చినట్లు సమాచారం.
విచారణ అనంతరం ట్రంప్‌ కోర్టు నుంచి వెళ్లిపోయారు. ఇక, క్రిమినల్ అభియోగాల కింద అరెస్టైన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.  అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయమూర్తి జువాన్‌ మెర్చన్‌ ఎదుటకు తన న్యాయవాదులతో కలిసి ట్రంప్ వచ్చారు. రెండు గంటల తర్వాత విడుదలయ్యారు. డిసెంబర్ 4కు కేసును వాయిదా వేశారు.

మాజీ అధ్యక్షుడిపై నమోదైన మొత్తం 34 అభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. అయితే, వాటన్నింటిలో తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్‌ విన్నవించారు.  డొనాల్డ్‌ ట్రంప్‌ 2006లో లేక్‌తాహో హోటల్‌లో స్టార్మీ డేనియల్స్‌ అనే నటితో శృంగారంలో పాల్గొన్నాడనే ఆరోపణలున్నాయి. స్వయంగా డేనియల్స్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ట్రంప్‌ను ఓ కార్యక్రమంలో కలుసుకున్నానని, ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నానని ఆమె చెప్పారు.
 
2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ట్రంప్‌ ఈ విషయంలో ఆమె నోటికి తాళం వేయాలని నిర్ణయించినట్లు మన్‌హటన్‌ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్‌ వ్యక్తిగత అడ్వొకేట్‌ కోహెన్‌ ద్వారా డేనియల్స్‌కు 1.30 లక్షల అమెరికా డాలర్లు ముట్టజెప్పినట్లు ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించింది. కోహెన్‌ దీన్ని నిర్ధారించారు.
 
మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోన్న ట్రంప్‌కు ఈ పరిణామం కొంత ప్రతికూలమే. పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో తన కున్న శారీరక సంబంధం గురించి బయటకు రాకుండా 2016 ఎన్నికల ముందు ట్రంప్ డబ్బులు చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 
మంగళవారం మధ్యాహ్నం కోర్టులో లొంగిపోయిన ట్రంప్‌.. తాను డేనియల్‌ను కలిసిన విషయం వాస్తవమేనని, అయితే ఆమెతో లైంగిక సంబంధాలు లేవని వాదనలు వినిపించారు. కోహెన్‌ వాంగ్మూలం, డేనియల్‌ ప్రకటనలను న్యూయార్క్‌ సుప్రీంకోర్టు జడ్జి మెర్చన్‌ ప్రస్తావించగా.. వాటిని ట్రంప్‌ ఖండించారు. తనకేపాపం తెలియదని, తనను దోషిగా ప్రకటించవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
 
ఈ ఒప్పందం విషయంలో వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించిన 34 నేరాలకు పాల్పడినట్లు మంగళవారం నాడు అంగీకరించారు.  ట్రంప్ విచారణకు హాజరు కావడంతో భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు, రిపబ్లికన్లు కోర్టు సమీపంలోని పార్కు వద్దకు చేరుకున్నారు. సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యులు వచ్చి ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు.
 
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్‌నకు మద్దతుగా జరిగే ఆందోళనల్లో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే  వారు ఎంతటివారైనా అరెస్టు చేశామని, శిక్షపడేలా చేస్తామని న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ హెచ్చరించారు.

కొంతమంది ట్రంప్ మద్దతుదారులు ప్రాసిక్యూటింగ్ అధికారులను హెచ్చరించడంతో మన్‌హట్టన్ కార్యాలయ వెబ్‌సైట్ బెదిరింపులను నివారించడానికి ‘మీట్ అవర్ టీమ్’ పేజీని తొలగించేంత వరకు వెళ్లింది. డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ తనపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవని, ఈ కేసును మన్‌హాటన్ అధికార పరిధి నుంచి మార్చాలని డిమాండ్ చేశారు.