అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటిలోకి చొరబడి, ఎటువంటి కారణం చెప్పకుండానే   తీసుకెళ్లారు. సంజయ్ ఇంటిని చుట్టుముట్టిన పోలీస్ బలగాలు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి.
 
తనను ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని, వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించినా వినిపించుకోలేదు.ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు. సంజయ్​ను తీసుకెళ్లకుండా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు.  పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను పోలీసులు ఈడ్చిపడేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సంజయ్ అత్తమ్మ చనిపోయి బుధవారానికి 9వ రోజు కావడంతో.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.
 
అర్థరాత్రి నల్గొండ జిల్లా బొమ్మలరామం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా అక్కడకు భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు చేరుకొని నిరసన తెలుపుతున్నారు. అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.  తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్‌ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి, దాదాపు ఒంటి గంట సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
 
నిజానికి, వరుసగా రెండో రోజు మంగళవారం కూడా పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సా్‌పలో ప్రత్యక్షమైంది. హనుమకొండలో హెచ్‌ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్‌ బూరం ప్రశాంత్‌ ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ దానిని వైరల్‌ చేశాడు.  హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు.
 
అయితే, మంత్రి ఎర్రబెల్లితోపాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే విజయ్‌ భాస్కర్‌ తదితరులతో ప్రశాంత్‌ దిగిన ఫొటోలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బయట పెట్టారు. ప్రశాంత్‌ బీజేపీ మనిషంటూ ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడేం చెబుతారంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను అరెస్టు చేశారేమోనన్న ప్రచారం జరుగుతోంది.
 
సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  బి ఎల్ సంతోష్ తీవ్రంగా ఖండించారు. అవినీతిలో కూరుకుపోయిన బిఆర్ఎస్ నాయకత్వం పాలన చేతకాక బిజెపి రాష్త్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసిందని ఆయన మండిపడ్డారు. బిఆర్ఎస్ మునిగిపోయే నావ అంటూ రాజకీయంగా ఆ పార్టీ సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయని స్పష్టం చేశారు.
 
సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు జరపాలని బిజెపి రాష్త్ర శాఖ పిలుపిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పైన, కేసీఆర్ కుటుంబపైన లీకేజి ప్యాకేజీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళుతుండడంతో దానిని పక్కదారి పట్టించేందుకు సంజయ్ ను అరెస్ట్ చేసి, ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని అంటూ బిజెపి ఎద్దేవా చేసింది.