అన్ని దేశాలపై ఉపగ్రహాలతో ముమ్మరంగా చైనా నిఘా

ఉపగ్రహాల ద్వారా ప్రపంచం ఆధిపత్యంపై కన్నేసి ఉంచే సరికొత్త వ్యూహానికి చైనా సిద్ధమవుతున్న సంకేతాలు వెల్లడవు తున్నాయి. అన్ని దేశాలపై ఉపగ్రహాలతో నిఘాను ముమ్మరం చేస్తోందని ప్రపంచ అంతరిక్ష రంగ నిపుణులు, రక్షణ రంగ పరిశోధకులు సందేహిస్తున్నారు.
 
గడిచిన ఆర్నెల్లుగా చైనా చేపడుతున్న వరుస శాటిలైట్‌ ప్రయోగాల లక్ష్యాలను విశ్లేషిం చి, ఈ మేరకు డ్రాగన్‌ కుట్రలపై సందేహాలు లేవనెత్తుతున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 ఉపగ్రహాలను చైనా ప్రయోగించింది. ఇవన్నీ తక్కువ ఆర్బిట్‌ శాటిలైట్లే. భూమికి సమీపంలో ఉండే కక్ష్యలోనే తిరుగుతుంటాయి.
 
తద్వారా తాను అనుకున్న ప్రాంతంపై నిఘాపెట్టి, అక్కడి హైరిజల్యూషన్‌ చిత్రాలను సేకరించేందుకు ఈ శాటిలైట్లు ఉపకరిస్తాయి. ఇలా ఇప్పటి వరకు అంతరిక్షంలో చైనాకు చెందిన 400కు పైగా లో ఆర్బిట్‌ ఉపగ్రహాలు ప్రపంచ దేశాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో స్వేచ్ఛా మీడియా లేకపోవడం, ప్రభుత్వ మీడియా అన్ని విషయాలను వెల్లడించక పోవడం వల్ల అనేక విషయాలు బాహ్య ప్రపంచానికి తెలీకుండా ఉండిపోతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా చెప్పిందే నిజమని భావించాల్సి వస్తుంది.
 
లో ఆర్బిట్‌ శాటిలైట్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. తమ ప్రయోగాలు వ్యవసాయ పరిశోధనలు, ఇంటర్నెట్‌ సేవల కోసమేనని చైనా చెబుతున్నది. రక్షణ రంగ నిపుణులు మాత్రం, బీజింగ్‌ మాటల్ని విశ్వసించలేమని అంటున్నారు. ప్రస్తుతం లో ఆర్బిట్‌లో మొత్తంగా 400కు పైగా ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. వీటిలో 347 ఉపగ్రహాలు చైనా సైన్యం పరిధిలోనివే కావడం విశేషం. ఉపగ్రహాలపై సైన్యం అజమాయిషీ ఉందంటే, కచ్చితంగా అవి నిఘా కోసం వినియోగిస్తున్న వేనని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల భారత్‌, అమెరికా సహా పలు దేశాల్లో చైనా నిఘా బెలూన్లు కలకలం రేపిన ఉదంతాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. భవిష్యత్‌లో యుద్ధాలు సైనికబలంతో కాకుండా, అంతరిక్ష శక్తితో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చైనా వ్యూహాలు ప్రపంచానికి ముప్పేనని పేర్కొంటున్నారు.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. మొదట ఉక్రెయిన్‌ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిన రష్యా వాటిని పూర్తిగా ధ్వంసం చేసిందని వివరిస్తున్నారు. లో ఆర్బిట్‌ ఉపగ్ర హాలు అణు యుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తాయని, ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తుందని ఆరోపిస్తున్నారు.

అంతరిక్షరంగంలో అమెరికాను అధిగమించేలా చైనా ప్రణాళికలు చేస్తోందని స్వయంగా పెంటగాన్‌ నివేదిక 2022 స్పష్టం చేసింది. లేకుంటే.. , అమెరికా గగనతలానికి ‘చైనా గ్రహణం’ పడుతుందని హచ్చరికలు చేసింది. 2045 కల్లా చైనా అంతరిక్ష రంగాన్ని శాసిస్తుందని ఆ నివేదిక అంచనా వేసింది.  తమదేశం నిర్వహించే 37జిపిఎస్‌ ఉపగ్రహాలతో పాటు అనేక వాణిజ్య, వాతావరణ ఉపగ్రహాలు, రక్షణ శాఖ పర్యవేక్షణా కార్యక్రమాల ద్వారా నిర్వహంచబడు తున్న అనేక ఉపగ్రహాలపై చైనా-రష్యా సైబర్‌ దాడులు చేసే ప్రమాదం ఉందని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్‌తోపాటు ఇతర చోట్ల అణు క్షిపణి నియంత్రణతో సహా వాయు, భూ సైనిక కార్యకలాపాలను జిపిఎస్‌ శాటిలైట్ల ద్వారా అమెరికా నిరంతరం సమన్వయం చేస్తుంటుందని చెప్పారు. నివేదికల ప్రకారం, చైనాకు రోబోటిక్‌ చేయి అమర్చిన ఉపగ్రహం ఉంది. ఇది మరొక ఉపగ్రహాన్ని పంజాతో పట్టుకునే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా అంతరిక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం బడ్జెట్‌లో 25 శాతం మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌ కేటాయింపులు పెెంచడం జరిగింది.