మరుగుదొడ్ల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ మాత్రమే

టాయిలెట్ల నిర్మాణం గురించి ప్రధాని నరేంద్ర మోదీ  తప్ప అంతకుముందున్న ఏ ఒక్క ప్రధాని కూడా మాట్లాడలేదని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గుర్తు చేశారు. ఎర్రకోట వేదికగా మరుగుదొడ్ల అవసరాన్ని మోదీ  నొక్కి చెప్పారని ఆయన కొనియాడారు.

ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన సోషియాలజీ ఆఫ్ శానిటేషన్  జాతీయ సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ పరిశుభ్రత, పారిశుధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మోదీ  సందేశం ఇచ్చారని చెప్పారు. గాంధీ కూడా పరిశుభ్రత, పారిశుధ్యానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ‘

‘శుభ్రంగా ఉండడమంటే దేవుడికి దగ్గరగా ఉండడమేనని గాంధీ అనేవారు. మనసు పరిశుద్ధంగా లేకపోతే, దేవుడి ఆశీర్వాదం పొందలేం. అలాగే మన శరీరం శుభ్రంగా లేకపోయినా భగవంతుడు ఆశీర్వదించడు. అపరిశుభ్రమైన ప్రాంతంలో ఉంటే మన శరీరం ఎలా శుద్ధంగా ఉంటుంది?” అని కోవింద్  ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా మరుగుదొడ్లు కట్టాలని, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మోదీ  చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. పరిశుభ్రత గురించి ఎవరైనా అర్థం చేసుకున్నారంటే అది ప్రధాని మోదీయే అని ఆయన స్పష్టం చేశారు. ‘‘మరుగుదొడ్లు కట్టాలని ఎర్రకోట నుంచి మోదీ సందేశం ఇచ్చినపుడు కొంత మంది ఆయన వ్యాఖ్యలను ఎగతాళి చేశారు.మరుగుదొడ్లుల కట్టడం ప్రధానమంత్రి పనా అంటూ ఎద్దేవా చేశారు. కానీ మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆయన నొక్కి చెప్పారు” అని కోవింద్  గుర్తుచేశారు.

 కాగా, ఆదివారం ప్రారంభమైన సోషియాలజీ ఆఫ్  శానిటేషన్ జాతీయ సమావేశం మూడు రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి వైస్ చాన్స్​లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సులభ్  ఇంటర్నేషనల్ కు చెందిన సులభ్  ఇంటర్నేషనల్  స్కూల్ ఆఫ్​ యాక్షన్  సోషియాలజీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నది.

పారిశుధ్యాన్ని సామాజిక మార్పుకు ఒక సాధనంగా అధ్యయనం చేయాలని చెబుతూ అందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవాలని మాజీ రాష్ట్రపతి సూచించారు. పారిశుధ్యం, దాని అధ్యయనాల కోసం విధానాలను రూపొందించాలని విద్యావేత్తలను ఈ సందర్భంగా కోవింద్  కోరారు. శానిటేషన్, సామాజిక సేవల్లో సులభ్ ఇంటర్నేషనల్  ఫౌండర్  బిందేశ్వర్   పాఠక్  చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఈ సమావేశం విజయవంతం  కావాలని ప్రధాని మోదీ  సందేశం పంపించారు.

‘‘పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరికీ సేఫ్ శానిటేషన్  సౌకర్యాలు అందించడంలో సులభ్  ఇంటర్నేషనల్ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతం” అని మోదీ  తన సందేశంలో ప్రశంసించారు. వర్సిటీల్లో సోషియాలజీ ఆఫ్  సానిటేషన్ అధ్యయనంపై మరింత కృషి చేయాలని మాజీ సీజేఐ తిరథ్  సింగ్  ఠాకూర్ విద్యావేత్తలకు పిలుపునిచ్చారు. బిందేశ్వర్  పాఠక్  చేస్తున్న కృషికి భారతరత్న ఇవ్వాలని, పద్మభూషణ్  అవార్డు ఆయనకు సరిపోదని ఆయన పేర్కొన్నారు.