సిసోడియా బెయిల్ పిటీషన్ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆప్ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. తనపై విచారణ పూర్తయ్యిందని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి.

ఈ సందర్భంగా బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఈడీ కూడా దర్యాప్తు చేస్తుందని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఇంకా సమయం పడుతుందని సీబీఐ స్పష్టం చేసింది. ఢిల్లీ స్కాంలో కేసులో విచారణ పూర్తి కాకుండా బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది సీబీఐ.

కీలక పాత్రధారిగా సిసోడియా ఉన్నారని, ఈ లావాదేవీల్లో విచారించాల్సిన వారు ఇంకా ఉన్నారని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు స్పష్టం చేసింది సీబీఐ. ఇదే సమయంలో సిసోడియా తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఇప్పటికే సీబీఐ, ఈడీలు లిక్కర్ స్కాంలో కస్టడీలోకి తీసుకుని విచారించాయని, కొత్తగా రాబట్టాల్సిన అంశాలు ఏమీ లేవని బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

సీబీఐ, ఈడీలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, ఎప్పుడు పిలిచినా హాజరవుతారని విచారణకు పూర్తిగా సహకరిస్తారని సిసోడియా తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. సిసోడియా బెయిల్ పిటీషన్ పై రెండు వర్గాల వాదనలు విన్న రౌన్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.  విచారణను ఏప్రిల్ 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు కస్టడీ పొడిగించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఆలోచన సిసోడియా చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మార్చి9న మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు, ముడుపుల వ్యవహారంపై సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సిసోడియా తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.