ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్  బంగా

ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా ఇండో-అమెరికన్‌ వ్యాపార వేత్త అజయ్ బంగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ పదవికి నామినేషన్‌ గడువు బుధవారంతో ముగిసిందని, ఒక్క నామినేషన్‌ మాత్రమే వచ్చిందని ప్రపంచ బ్యాంకు అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ తన పదవీకాలం ముగియకముందే పదవి నుంచి వైదొలగుతుండటంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా మద్దతుదారులే ఎన్నికయ్యే ఈ పదవికి 63 ఏళ్ల బంగాను యుఎస్‌ఎ అధ్యక్షుడు జోబైడ్‌న్‌ నామినేట్‌ చేశారు.

ఫిబ్రవరి లో ఆయన పేరును ప్రకటిస్తూ చరిత్రలో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ అంతర్జాతీయ బ్యాంకుకు నేతృత్వం వహించడానికి అవసరమైన అన్ని `సాధన సంపత్తులు’ గల వ్యక్తిగా అజయ్ బగాని బిడెన్ అభివర్ణించారు. 21వ శతాబ్ధపు సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ప్రపంచ బ్యాంకును తీర్చిదిద్దగలరని అమెరికా భావిస్తున్నది.

 అజయ్ బంగా తండ్రి ఇండియన్‌ ఆర్మీ అధికారి. ఫూణెలోని ఖడ్కీ కంటోన్మెంట్‌లో ఆయన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ, ఆహ్మదాబాద్‌ ఐఐటిలో ఎంబిఎ పూర్తి చేశారు.  నెస్ట్లె సాలో అమ్మకాలు, మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో దీర్ఘకాలం కొనసాగారు.

అనంతరం పెప్సీకో ఇంక్‌లో చేరిన ఆయన భారత్‌లో మొట్టమొదటి ఫాస్ట్‌ఫుడ్‌ ఫ్రాంచైజీని ప్రారంభించేందుకు కృషి చేశారు. ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ కంపెనీ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో మాస్టర్‌కార్డ్‌ అధ్యక్షుడు -సిఇఒగా విధులు నిర్వర్తించారు. 2016లో పద్మశ్రీ వరించగా, 2019లో ది ఎల్లిస్‌ ఐలాండ్‌ మెడల్‌ ఆఫ్‌ హానర్‌, బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ గ్లోబర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు పొందారు.