నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావంతో తెలంగాణాలో రాబోయే నాలుగు రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు  కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం  తెలిపింది.

రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.  నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.  దీని ప్రభావంతో గరిష్ఠంగా 37 డిగ్రీల సెల్సియస్‌, కనిష్టంగా 25 డిగ్రీల సెల్పియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

శని, ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ కేంద్రం జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. భద్రాచలంలో గాలివాన భీభత్సం సృష్టించింది. యోగ నరసింహాస్వామి దేవాలయంలో ధ్వజస్తంభంపై పిడుగు పడింది.