అవి బిజెపి కార్యాలయాలు కావు, సంస్కార కేంద్రాలు

దేశంలో ఇప్పటివరకు 500 బీజేపీ కార్యాలయాలు నిర్మించామని చెబుతూ ఇవి కార్యాలయాలు కాదు.. సంస్కార్ కేంద్రాలని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లా కార్యాలయాలను ప్రారంభించామని తెలిపారు.

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న తెలంగాణలో శుక్రవారం జేపీ నడ్డా సంగారెడ్డిలో పర్యటించి వర్చ్యువల్ గా పార్టీ కార్యాలయాలను రెండు తెలుగు రాస్త్రాలలో ప్రారంభించాల్సి ఉంది. ఇది రద్దవడంతో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ గా  పాల్గొని తెలంగాణలోని సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లా కార్యాలయాలను ప్రారంభించామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 108 కార్యాలయాల నిర్మాణం జరుగుతోందని నడ్డా తెలిపారు. ఈ రాష్ట్రాల్లో సంస్థాగతంగా కూడా పార్టీని విస్తరింపజేస్తున్నామని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, పటిష్టమైన సిద్దాంతాలు కలిగిన పార్టీ కూడా బీజేపీ అని నడ్డా స్పష్టం చేశారు. దేశం మొత్తంలో పటిష్టమైన క్యాడర్ కలిగి ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. 18 కోట్ల సభ్యత్వం కలిగి ఉండటమే కాదు, 973 జిల్లా కమిటీలతో పని చేస్తున్న పార్టీ బీజేపీ అని వివరించారు.

కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందని ఆరోపించారు.  టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడం కాదు వీఆర్ఎస్ తీసుకోవాలని హితవు చెప్పారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ ప్రయాసపడుతున్నాడని నడ్డా ఎద్దేవ చేశారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కుటుంబ పాలనలో చిక్కుకుపోయిందని నడ్డా  విమర్శించారు. తెలంగాణను అవినీతి ఊబిలో దించారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తోందంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని భ్రష్టాచార్ (అవినీతి) రిష్వత్ (లంచగొండి) సర్కార్ అని కొత్త నిర్వచనం ఇచ్చారు.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అలాంటిది ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని చెప్పారు. ఇంతగా లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినప్పటికీ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఆ నిధులు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రం అప్పులపాలు కావడానికి కారణం బీఆర్ఎస్ పరిపాలనేనని ఆరోపించారు.

తెలంగాణ, ఏపీలను అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఎంతో చేసిందని జేపీ నడ్డా తెలిపారు. జాతీయ రహదారులను మంజూరు చేశామని, వాటిని విస్తరించామని గుర్తు చేశారు. కొత్త రైలు మార్గాలను కేటాయించామని పేర్కొన్నారు. విమానాశ్రయాలను నెలకొల్పామని వివరించారు. పరిశ్రమలను స్థాపించడానికి అనువైన వాతావరణాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్పించామని పేర్కొన్నారు.
 
శక్తివంచన లేకుండా మోదీ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నారని చెబుతూ  ప్రత్యేకించి తెలంగాణలో అవినీతిమయమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి అనేది పేదలకు చేరట్లేదని నడ్డా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను సాగనంపడానికి ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని, బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకోవాలని పార్టీ క్యాడర్ కు సూచించారు.