అమెరికా టెక్‌ రంగంలోని భారతీయులకు భారీ ఉపశమనం

అమెరికా టెక్‌ రంగంలోని భారతీయ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగింది. హెచ్‌1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల భాగస్వామ్యులు కూడా ఉద్యోగాలు చేయవచ్చని అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకోవచ్చని వెల్లడించింది.

‘సేవ్‌ జాబ్స్‌ యుఎస్‌ఎ ‘ సంస్థ దాఖలు చేసిన దావాను యూఎస్‌ జిల్లా న్యాయమూర్తి తన్యా చుక్తాన్‌ కొట్టివేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్‌1బీ వీసాతో అమెరికాలో పని చేస్తున్న వారి జీవితభాగస్వామి కూడా ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిగేలా చట్టంలో సవరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

దీనివల్ల స్థానికంగా ఉన్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయంటూ ఆ దావాలో పేర్కొన్నారు. అయితే అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ దావాను వ్యతిరేకించాయి. హెచ్‌1బీ వీసాతో అత్యధికంగా భారతీయులు  అమెరికాలో ఉద్యోగాలకు వెళుతుంటారు.

దీంతో ఈ తీర్పుతో  అమెరికాలోని చాలా మంది భారతీయులకు ఉపశమనం కలగనుంది.  హెచ్‌ 4 వీసా పొందిన విదేశీయులు అమెరికాలో వున్న సమయంలో పనిచేసుకోవడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీకి కాంగ్రెస్‌ ఎప్పుడూ  అధికారాన్ని మంజూరు చేయలేదని సేవ్‌ జాబ్స్‌ యుఎస్ఎ   పిటిషన్‌లో పేర్కొన్నట్లు  తీర్పు సందర్భంగా న్యాయమూర్తి తాన్యా చుట్కాన్‌ పేర్కొన్నారు.

అయితే హెచ్‌ 4 వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో వుంటూ ఉద్యోగం చేసుకునేలా అనుమతి ఇచ్చేందుకు దేశ చట్టసభలు మొగ్గు చూపుతున్నాయని చుట్కాన్‌ గుర్తుచేశారు.   డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ కేవలం విద్యార్ధులకే కాకుండా వారి జీవిత భాగస్వాములు వారిపై  ఆధారపడిన  వారికి కూడా గతంలో ఉపాధిని కల్పించిందని న్యాయమూర్తి గుర్తుచేశారు.  కోర్టు తీర్పు పట్ల అమెరికాలోని భారతీయులతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.