కెటిఆర్ పరువు ఖరీదు రూ.100 కోట్లా?

మంత్రి కెటిఆర్ నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కెటిఆర్ వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామంటున్నారని అంటూ  కెటిఆర్ పరువు ఖరీదు వంద కోట్లా? అని ఎద్దేవా చేశారు. యువత భవిష్యత్తు మూల్యమెంతో కెటిఆర్ చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీలో తన కుట్ర ఉందని కెటిఆర్ కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేస్తూ కెటిఆర్ ఆరోపణలపై తాను ఎన్ని కోట్లకు దావా వేయాలని సంజయ్ ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్‌ను బర్తరఫ్ చేసేదాకా పోరాడుతామని తేల్చి చెప్పారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి మరోమారు డిమాండ్ చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కె. తారక రామారావు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు.  టిఎస్‌పిఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్ధేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు.

 ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో కెటిఆర్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే  ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.