కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్  అంశంపై విద్యార్థి సంఘాల ఆందోళనలు ఆగటం లేదు. ఓవైపు ఉస్మానియా వర్శిటీలో నిరసనలు వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందిపడే పరిస్థితులు వచ్చాయని, వారిక భరోసా కల్పించే దిశగా సభను నిర్వహించాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి.

దీనికి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభగా పేరును నిర్ణయించారు. సంఘర్షణ సభకు విసి అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మహాధర్నాకు దిగారు. వీసీ ఛాంబర్‌లోకి దూసుకెళ్లడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ధర్నా చేపట్టారు.

వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు యత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థులు కిటికీలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. వీసీ భవనం పైకెక్కి కొందరు విద్యార్థులు నిరసన తెలిపారు. గమనించిన పోలీసులు వీసీ భవనం పైకి ఎక్కిన వారిని కిందకు దించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. సభకు వర్సిటీ అధికారులు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ వీసీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ కారణంగా 30 లక్షల మంది విద్యార్థులు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… వారికి భరోసా కల్పించేందుకు సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. కానీ వీసీ మాత్రం ప్రభుత్వానికి తొత్తుగా మారి, అనుమతిని నిరాకరించారని మండిపడ్డారు.

పేపర్ లీకేజీ అంశంలో ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. సభ నిర్వహణపై హైకోర్టును ఆశ్రయిస్తామని తేల్చి చెప్పారు.